Rajinikanth: రాజకీయాల్లోకి వస్తారా? రజనీకాంత్ సమాధానమేంటంటే..?

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ నేడు తమిళనాడు గవర్నర్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. రజనీ మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా?

Published : 08 Aug 2022 18:00 IST

చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ నేడు తమిళనాడు గవర్నర్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. రజనీ మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. తనకు అలాంటి ఆలోచనేదీ లేదని మరోసారి స్పష్టం చేశారు.

సోమవారం తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవితో రజనీకాంత్‌ భేటీ అయ్యారు. ఈ ఉదయం చెన్నైలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. దాదాపు అరగంట పాటు గవర్నర్‌తో చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీ అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. భేటీలో భాగంగా తాము రాజకీయాల గురించి కూడా చర్చించామని, అయితే ఆ వివరాలను తాను వెల్లడించలేనని అన్నారు. దీంతో భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా? అని మీడియా ఆయన్ను ప్రశ్నించింది. అయితే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదని రజనీ తెలిపారు.

2017లో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చేశారు. రాజకీయ పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. కొన్నేళ్ల పాటు ఆ దిశగా ప్రయత్నాలు చేసిన ఆయన.. 2020 డిసెంబరులో ఆ ఆలోచనను విరమించుకున్నారు. కొవిడ్ పరిస్థితులు‌, అనారోగ్య సమస్యల కారణంగా తాను రాజకీయాల్లో రావట్లేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని