Updated : 18 May 2022 12:09 IST

Rajiv Gandhi assassination: రాజీవ్‌ గాంధీ హత్య కేసు.. దోషి విడుదలకు సుప్రీం ఓకే

దిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి. పేరరివాళన్‌ విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పేరరివాళన్‌ విడుదలతో ఈ కేసులో జీవితఖైదు అనుభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్‌ సహా ఇతర నిందితుల విడుదలకు కూడా మార్గం సుగమమైనట్లైంది.

పేరరివాళన్‌ విడుదలకు 2016, 2018లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ.. గవర్నర్‌తో విభేదాల కారణంగా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత గతేడాది తమిళనాడు గవర్నర్‌ పేరరివాళన్‌ క్షమాభిక్ష దస్త్రాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వ సిఫార్సులపై పేరరివాళన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది. అతడి క్షమాభిక్ష దస్త్రాన్ని గవర్నర్‌ రాష్ట్రపతికి సిఫార్సు చేశారని, దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేవరకూ నిరీక్షించాలని గతంలో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఇందుకు న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.  క్షమాభిక్షకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయానికి కట్టుబడి ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్‌... అందుకు సంబంధించిన దస్త్రాన్ని రాష్ట్రపతికి సిఫారసు చేయడాన్ని ఆక్షేపించింది. ఆర్టికల్‌ 161 ప్రకారం గవర్నర్‌ తన అధికారాలను వినియోగించకుండా... రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చా? లేదా? అనేది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక, పేరరివాళన్‌ 30ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడని, జైల్లో అతని ప్రవర్తన బాగుందని తెలిపింది. జైల్లో ఉంటూనే అతను ఉన్నత విద్యను అభ్యసించిన విషయాన్ని గుర్తుచేసింది. 20 ఏళ్ల శిక్ష పూర్తిచేసిన వారిని విడుదల చేయాలని గతంలో ఎన్నో తీర్పులు ఉన్నాయి. అలాంటప్పుడు పేరరివాళన్‌ విషయంలో వివక్ష చూపడం సరికాదని అభిప్రాయపడింది.

గతవారం దీనిపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపగా.. కేంద్రం తన వాదనలు వినిపించింది. క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉందని తెలిపింది. దీన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. అంటే.. ఇన్నేళ్లపాటు గవర్నర్లు ప్రసాదించిన క్షమాభిక్షలు రాజ్యాంగ విరుద్ధమా అని ప్రశ్నించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు బుధవారం తుది తీర్పు వెలువరించింది. ఆర్టికల్‌ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి పేరరివాళన్‌ విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం స్పష్టం చేసింది.

1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీపై ధను అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ దుర్ఘటనలో రాజీవ్‌ గాంధీతో పాటు మరో 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998లో వారికి ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ఆ మరుసటి ఏడాదే పేరరివాళన్‌ సహా మురుగన్‌, నళిని, శాంతన్‌ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అనంతరం 2014లో పేరరివాళన్‌తో పాటు శాంతన్‌, మురుగన్‌ మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. ఇక, సోనియాగాంధీ జోక్యంతో 2000 సంవత్సరంలో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని