IAF: ఇక.. రోడ్డుపైనా యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్‌

అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమనాలు హైవేలపై ల్యాండ్‌ అయ్యేందుకు వీలుగా మార్పులు చేసిన రాజస్థాన్‌లోని సట్టా-గాంధవ్‌ స్ట్రెచ్‌ను కేంద్ర రక్షణమంత్రి

Updated : 09 Sep 2021 16:05 IST

తొలి స్ట్రెచ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, గడ్కరీ

బర్మేర్‌: అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమనాలు హైవేలపై ల్యాండ్‌ అయ్యేందుకు వీలుగా మార్పులు చేసిన రాజస్థాన్‌లోని సట్టా-గాంధవ్‌ స్ట్రెచ్‌ను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ప్రారంభించారు. బర్మేర్‌ జిల్లాలోని 925 నంబరు జాతీయ రహదారిపై ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ స్ట్రెచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాయుసేన నిర్వహించిన డ్రిల్‌లో తొలుత హెర్క్యూలెస్‌ సి-130జే యుద్ధవిమానం జాతీయ రహదారిపై ల్యాండ్‌ అయ్యింది. 

ఈ విమానంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, గడ్కరీ, గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో పాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, వాయుసేనాధిపతి ఆర్‌కేఎస్‌ బదౌరియా ప్రయాణించారు. కేంద్రమంత్రులు ప్రయాణించిన విమానం తర్వాత సుఖోయ్‌-30ఎంకేఐ ఫైటర్‌ జెట్‌, ఏఎన్‌-32 మిలిటరీ రవాణా విమానం, ఎంఐ-17 వంటి హెలికాప్టర్లు కూడా ఈ హైవేపై ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫెసిలిటీలో దిగాయి.

 

దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ స్ట్రెచ్‌ను ఏర్పాటు చేశారు. సాధారణంగా యుద్ధ పరిస్థితులు శత్రువులు ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నప్పుడు యుద్ధ విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు వీలుగా ఇలా హైవేలపై ల్యాండింగ్‌ స్ట్రెచ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి 28 హైవేలను గుర్తించారు. తొలి ప్రయత్నంగా బర్మేర్‌లోని 925వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేశారు. మొత్తం 19 నెలలు శ్రమించి దీన్ని నిర్మించారు. 2017లో లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పైనా వాయుసేన ఇలాంటి మాక్‌ ల్యాండింగ్‌ డ్రిల్‌ చేపట్టింది. అయితే, హైవేపై ల్యాండింగ్‌ చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘సాధారణంగా హైవేలపై ట్రక్కులు, కార్లు చూస్తుంటాం. ఇప్పుడు అక్కడ విమానాలు కూడా దిగుతున్నాయి. ఇందుకోసం కృషిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు. భారత్‌ తమ దేశ సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పేందుకు ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫీల్డ్‌లే నిదర్శనం. కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా, విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అని వివరించారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని