Rajnath Singh: లైఫ్‌ సపోర్ట్‌పై గ్రూప్‌ కెప్టెన్‌.. హెలికాప్టర్‌ దుర్ఘటనపై రాజ్‌నాథ్‌ ప్రకటన

భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ

Updated : 09 Dec 2021 12:56 IST

దిల్లీ: భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్ ఉభయసభల్లో నేడు ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు వెల్లడించారు. 

‘‘బాధాతప్త హృదయంతో ఈ దురదృష్టకర వార్తను చెబుతున్నా. భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న మిలిటరీ హెలికాప్టర్‌ డిసెంబరు 8న తమిళనాడులో కుప్పకూలింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ స్టాఫ్‌ కాలేజ్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్‌లో రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లింగ్టన్‌ బయల్దేరారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వీరు ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. 12.08 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌ రాడార్‌ నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సంకేతాలు నిలిచిపోయాయి. కున్నూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలను గుర్తించిన స్థానికులు అక్కడకు వెళ్లారు. అప్పటికే హెలికాప్టర్‌ మంటల్లో ఉంది. సమాచారమందుకున్న రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. రావత్‌, హెలికాప్టర్‌ ప్రయాణికులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో రావత్‌, ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం చెందడం బాధాకరం’’ అని రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు.  అనంతరం రావత్‌ మృతికి సంతాపంగా ఉభయ సభల సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.  

ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తు

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలను శుక్రవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు. ఈ సాయంత్రానికి రావత్‌ దంపతుల భౌతికకాయాలు దిల్లీకి చేరుకుంటాయని తెలిపారు. ప్రమాదంపై భారత వాయుసేన.. త్రివిధ దళాల దర్యాప్తును ఆదేశించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఎయిర్‌ మార్షల్‌ మానవీంద్ర సింగ్‌ నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుందన్నారు. ఇప్పటికే ఈ బృందం వెల్లింగ్టన్‌ చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

లైఫ్ సపోర్ట్‌పై గ్రూప్‌ కెప్టెన్‌..

ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆయనను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్‌ సింగ్‌కు వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అవసరమైతే బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని