Agnipath protests: అల్లర్ల మధ్య రాజ్‌నాథ్‌ రెండో అత్యున్నత స్థాయి సమీక్ష

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ నేడు ఉదయం 10:30 గంటల సమయంలో అత్యున్నత స్థాయి సమీక్షకి పిలుపునిచ్చారు....

Updated : 19 Jun 2022 15:27 IST

దిల్లీ: అగ్నిపథ్‌ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించినప్పటికీ.. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సైనిక నియామక విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ నుంచి ఉద్యోగార్థులు వెనక్కి తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారమూ సైనిక ఉద్యోగార్థులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ నేడు ఉదయం 10:30 గంటల సమయంలో అత్యున్నత స్థాయి సమీక్షకి పిలుపునిచ్చారు.

ఇలా 24 గంటల వ్యవధిలో రెండోసారి ఆయన సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ భేటీలో త్రివిధ దళాధిపతులతో సహా రక్షణ, హోంశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిన్న సమీక్ష నిర్వహించిన అనంతరం సైన్యంలో చేరి నాలుగేళ్లు పూర్తిచేసుకున్న ‘అగ్నివీర్‌’లకు కేంద్ర పారామిలిటరీ బలగాల్లో, అస్సాం రైఫిల్స్‌లో 10% పోస్టుల్ని కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆమోదం తెలిపారు. తీరగస్తీ దళంలో, రక్షణ రంగ సివిలియన్‌ పోస్టుల్లో, ఈ రంగానికి చెందిన 16 ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా 10% రిజర్వేషన్‌ వర్తిస్తుందని ఆయన కార్యాలయం తెలిపింది. మాజీ సైనికుల కోటాకు ఇది అదనమని, నియామక నిబంధనల్లో ఈ మేరకు సవరణలు చేయనున్నామని ట్వీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో నేటి సమీక్ష తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయోనన్న చర్చ ప్రారంభమైంది.

అగ్నిపథ్‌ అమలు విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, అల్లర్లను చల్లార్చేందుకు మరిన్ని ఉపశమనాలు ప్రకటించొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే త్రివిధ దళాలు త్వరలో నియామక ప్రక్రియ చేపడతామని ప్రకటించాయి. మరోవైపు వాయుసేన ఏకంగా నేడు నియామక ప్రక్రియ వివరాలనూ వెల్లడించింది.

మరోవైపు ఉద్యోగార్థులు రైల్వే స్టేషన్లను కేంద్రంగా చేసుకొని నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేడు కూడా రైల్వేశాఖ పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్నింటి సమయాన్ని మారుస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు నేడు జంతర్‌మంతర్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని