రామమందిరం భారతీయుల ఆత్మగౌరవం!

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించబోయే రామమందిరం భారతీయుల ఆత్మగౌరవానికి నిదర్శనమని ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతలు అభిప్రాయపడ్డారు. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేసిన  ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో..

Published : 07 Jan 2021 21:12 IST

గాంధీనగర్‌: శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించబోయే రామమందిరం భారతీయుల ఆత్మగౌరవానికి నిదర్శనమని ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతలు ప్రకటించారు. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేసిన  ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సంఘ్‌ సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌, భయ్యాజీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొని ప్రసంగించారు. సంఘ్‌పరివార్‌ ఆధ్వర్యంలో పని చేస్తున్న దాదాపు 34 సంస్థల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

దేశ వ్యాప్తంగా దాదాపు 5 లక్షల గ్రామాల్లోని 10 కోట్ల కుటుంబాలను కలిసి విరాళాలు సేకరించేందుకు ప్రణాళికలు వేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ జాయింట్‌ సెక్రటరీ కృష్ణగోపాల్ తెలిపారు. ఎవరి శక్తిమేరకు వారు సాయం చేయవచ్చన్నారు. గాంధీనగర్‌లో ఈ నెల 5 నుంచి మూడు రోజుల పాటు  నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై వక్తలు మాట్లాడారు. వెనకబడిన హిందూ కుటుంబాలను రక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. ‘‘ మన పండగలు ప్రతి ఒక్కరివీ.. మన ఆచారాలు, సంస్కృతి ప్రతి ఒక్కరివీ. హిందూ సమాజాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడానికి మనమంతా కృషి చేయాలి’’ అని కృష్ణగోపాల్‌ అన్నారు. హిందూ మతం నేర్పించిన కుటుంబ విలువలను తర్వాత తరాల వారికి అందించాలని కోరారు. చిన్నపాటి తగాదాలతో కుటుంబాలు ముక్కలవుతున్నాయని, ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగైతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. 

చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, అందువల్ల పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు చెప్పారు. పర్యావరణంలో సమతుల్యత లోపించడం వినాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. కరోనా విస్తృతి దృష్ట్యా కేంద్రం మార్గదర్శకాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అయోధ్య రామమందిరం నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి

మా వ్యాక్సిన్‌తో రెండేళ్లపాటు ఇమ్యూనిటీ..!

బైడెన్‌ ఎన్నిక.. కిమ్‌ కీలక నిర్ణయం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని