బ్రిజ్‌ భూషణ్‌ మాటలు అర్థం లేనివి.. అతడిని వెంటనే అరెస్టు చేయాలి: రెజ్లర్లకు రామ్‌దేవ్‌బాబా సపోర్ట్‌

Wrestlers Protest: తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేస్తోన్న స్టార్‌ రెజ్లర్లకు యోగా గురువు రామ్‌ దేవ్‌ బాబా (Ramdev Baba) మద్దతు తెలిపారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. 

Updated : 27 May 2023 17:24 IST

దిల్లీ:  లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)ను అరెస్టు  చేయాలంటూ గత కొంతకాలంగా స్టార్‌ రెజ్లర్లు దిల్లీలో నిరసన కొనసాగిస్తున్నారు. తాజాగా దీనిపై ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా(Yoga guru Ramdev Baba) స్పందించారు. కుస్తీ యోధులకు తన మద్దతు ప్రకటించారు.

‘రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రెజ్లర్లు దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. ఈ పరిస్థితి రావడం సిగ్గుచేటు. వేధింపులకు పాల్పడే వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి.. జైల్లో పెట్టాలి. ఆ వ్యక్తి మహిళల గురించి చెత్తగా మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగినది’ అని అన్నారు. అలాగే దిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ, ఇంకా అరెస్టు చేయకపోవడంపై మీడియా ప్రశ్నించగా.. తాను కేవలం ప్రకటనలు మాత్రమే చేయగలనని, అతడిని జైల్లో పెట్టే అధికారం లేదని బదులిచ్చారు. ‘నేను అన్ని ప్రశ్నలకు రాజకీయంగా బదులివ్వగలను. నేనేమీ మానసిక వికలాంగుడిని కాదు. దేశం పట్ల నాకో విజన్ ఉంది. నేను రాజకీయంగా ఏదైనా ప్రకటనలు చేస్తే.. అవి ఎన్నో మలుపులు తిరుగుతాయి’ అని బాబా(Yoga guru Ramdev Baba ) వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ ప్రారంభానికి బ్రిజ్‌భూషణ్‌ హాజరైతే..: వినేశ్‌

ఆదివారం జరగబోయే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బ్రిజ్‌ భూషణ్ హాజరైతే.. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి స్పష్టమైన సందేశం ప్రజలకు వెళ్తుందని రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్(Vinesh Phogat) అన్నారు. ‘ఆయనకు ఎవరు మద్దతు పలికినా వారు మాకు వ్యతిరేకమే. ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ.. కొంతమంది ఆయన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అది సరికాదు. ఆయన దేశంలోని ఆడబిడ్డలకు హాని చేస్తున్నారు’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని