Ramdev: ‘నేను నీ కాంట్రాక్టర్‌ను కాదు.. నోర్మూసుకో ’.. సహనం కోల్పోయిన యోగా గురువు రామ్‌దేవ్‌

దేశవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు వీటి గురించి ఎదురైన ప్రశ్నతో యోగా గురువు రామ్‌దేవ్ బాబా కూడా మండిపోయారు. కెమెరా ఎదురుగానే తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

Published : 01 Apr 2022 01:26 IST

ధరల పెరుగుదలపై ప్రశ్నించినందుకు ఆగ్రహం

దిల్లీ: దేశవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు వీటి గురించి ఎదురైన ప్రశ్నతో యోగా గురువు రామ్‌దేవ్ బాబా భగ్గుమన్నారు. కెమెరా ఎదురుగానే తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

హరియాణా రాష్ట్రంలోని కర్నాల్‌లో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ పాత్రికేయుడు బాబా గతంలో పెట్రోల్, వంటగ్యాస్ ధరల గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్‌ రూ.40, గ్యాస్‌ సిలిండర్ రూ.300కు ఇచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో ఆయన ఇబ్బందిపడ్డారు. ‘అవును నేను ఆ మాట అన్నాను. ఇప్పుడేం చేస్తావ్‌? ఇలాంటి ప్రశ్నలూ అడుగుతూ ఉండకు. నీకు సమాధానం ఇవ్వడానికి నేను నీ కాంట్రాక్టర్‌ను కాదు’ అని కోప్పడ్డారు. ఆ తర్వాత ఆ పాత్రికేయుడు మళ్లీ అదే ప్రశ్న అడిగారు. ఈ సారి సహనం కోల్పోయిన రామ్ దేవ్ బాబా..‘నేను ఆ మాట అన్నాను. అయితే ఏంటి..? నోర్ముసుకో. మళ్లీ అడిగితే బాగుండదు. పద్ధతిగా ఉండు’ అంటూ హెచ్చరించారు.

ధరలు పెరుగుతోన్న ఈ క్లిష్ట సమయంలో ప్రజలు కష్టపడి పనిచేయాలని యోగా గురువు సూచించారు. ‘చమురు ధరలు తగ్గితే.. పన్ను రాదని ప్రభుత్వం అంటోంది. వచ్చే ఆదాయం తగ్గితే జీతాలు ఎలా ఇవ్వాలి, రోడ్లు ఎలా వేయాలి, దేశాన్ని ఎలా నడిపించాలని ప్రశ్నిస్తోంది. అసలైతే ఈ ద్రవ్యోల్బణం తగ్గాలి. అది నేను ఒప్పుకుంటా. కానీ, ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా శ్రమించాలి. నేను ఉదయం నాలుగు గంటలకు లేచి రాత్రి పది వరకు పనిచేస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా.. సామాన్యుడి గుండె జారిపోయేలా దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. గురువారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 80 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గత 10 రోజుల్లో 9 సార్లు వీటి ధరలను సవరించగా.. ఈ వ్యవధిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.6.40 పెరిగింది. ఈ వరుస పెంపులతో విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని