వ్యాక్సిన్‌ కంటే వైరస్‌ వల్లే ప్రమాదం ఎక్కువ!

వ్యాక్సిన్‌ వల్ల రక్తం గడ్డకట్టడంతో పోలిస్తే కొవిడ్‌-19 వైరస్‌ కలిగించే నష్టమే ఎక్కువని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

Published : 15 Apr 2021 20:55 IST

ఆక్స్‌ఫర్డ్‌ అధ్యయనంలో వెల్లడి

లండన్‌: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొందరిలో రక్తం గడ్డ కడుతున్నట్లు పలుదేశాల్లో ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఇలాంటి సంఘటనలతో పోలిస్తే కొవిడ్‌-19 వైరస్‌ కలిగించే నష్టమే ఎక్కువని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం రక్తం గడ్డకట్టడంపై వస్తోన్న ఫిర్యాదులపై బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు పరిశోధన చేశారు. కరోనా సోకడం వల్ల, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టిన (సెరెబ్రల్‌ వెనస్‌ థ్రోంబోసిస్‌-సీవీటీ) కేసులను విశ్లేషించారు. సాధారణ ప్రజల్లో ఇన్‌ఫ్ల్యూయెంజా వల్ల కలిగే సీవీటీ కేసులను వీటితో పోల్చి చూశారు. దీంతో కరోనా సోకిన కొందరిలో రక్తం గడ్డకట్టడం (సీవీటీ) సాధారణమనే అభిప్రాయానికి వచ్చారు. వ్యాక్సిన్‌లతో పోల్చితే కొవిడ్‌-19 వల్ల కలిగే ప్రమాదం 8 నుంచి 10 రెట్లు ఎక్కువని స్పష్టం చేశారు.

‘కరోనా వ్యాక్సిన్‌ వల్ల కలిగే దుష్ర్పభావాలపై పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే వ్యాక్సిన్‌ కంటే వైరస్‌ వల్లే దుష్ర్పభావాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని ట్రాన్‌స్లేషనల్‌ న్యూరోబయోలజీ విభాగాధిపతి పాల్‌ హ్యారిసన్‌ పేర్కొన్నారు. అంతేకాక 30 ఏళ్లలోపు వారిలోనూ వైరస్‌ వల్ల సీవీటీ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదాలు 30 శాతం ఉన్నట్లు పరిశోధనలో గుర్తించామని చెప్పారు. అందుచేత వ్యాక్సిన్‌తో కలిగే నష్టాల కంటే ప్రయోజనాలే ఎక్కువని తెలిపారు.

వ్యాక్సిన్‌, కొవిడ్‌-19‌.. ఈ రెండింటి కారణంగా రక్తం గడ్డకట్టే సమస్యలు ఒకేలా ఉన్నాయా? లేదా భిన్నంగా ఉన్నాయా? అనే కోణంలో మరికొన్ని అధ్యయనాలు చేపట్టాల్సి ఉందని పాల్‌ హ్యారిసన్‌ అభిప్రాయపడ్డారు. రక్తం గడ్డ కట్టడాన్ని తెలుసుకునేందుకు చేసే వైద్య పరీక్షల్లోనూ జాగ్రత్త వహించాలని.. లేకపోతే ఒక్కోసారి తప్పుడు కోడింగ్‌ వల్ల సీవీటీ ఫలితాల కచ్చితత్వంపై ప్రభావం పడుతుందని సూచించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేసిన ఆస్ట్రాజెనెకా, అమెరికా సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలు తీసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతున్నట్లు పలు దేశాల్లో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ టీకాల పంపిణీని ఆయా దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని