Shiv Sena: అద్భుతం... జై శంకర్‌ను ప్రశంసించిన శివసేన

రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై అమెరికా ఆందోళనలను కొట్టిపారేస్తూ.. దీటుగా స్పందించిన విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ప్రతిపక్ష నేతల నుంచి ప్రశంసలు దక్కాయి.

Published : 13 Apr 2022 01:33 IST

దిల్లీ: రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై అమెరికా ఆందోళనలను కొట్టిపారేస్తూ.. దీటుగా స్పందించిన విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ప్రతిపక్ష నేతల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘సూపర్’ అంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది జైశంకర్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. చప్పట్లు కొడుతున్న ఎమోజీలను షేర్ చేశారు. 

2+2 చర్చల సందర్భంగా.. భారత మంత్రులు జైశంకర్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమెరికా మంత్రులు ఆంటోని బ్లింకన్‌, లాయిడ్‌ ఆస్టిన్లు సంయుక్తంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో చమురు కొనుగోలు అంశం ప్రస్తావనకొచ్చింది. దానిపై జై శంకర్ మాట్లాడుతూ.. ‘మీకు చమురు కొనుగోళ్లకు సంబంధించిన ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశం వస్తే.. మీ దృష్టి ఐరోపాపై ఉండాలి. భారత్‌ కూడా ఇంధన అవసరాల రీత్యా కొనుగోలు చేస్తుంది. కానీ, అంకెలను పరిశీలిస్తే.. భారత్‌ నెలరోజుల్లో కొనుగోలు చేసినంత చమురును ఐరోపా ఒక్క మధ్యాహ్నంలోనే కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణపై మా దేశం చేసిన ప్రకటనలే మా వైఖరిని వెల్లడిస్తాయి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తాం. సమస్యలను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే మా విధానం. ఈ లక్ష్య సాధనకు అవసరమైన సహకారాన్ని అన్ని రకాలుగా అందజేస్తాం’ అని వెల్లడించారు. 

ఇలా అగ్రదేశం ముందు తన విదేశాంగ విధానాన్ని భారత్ స్పష్టంగా వెల్లడిచేయడం ఈ శివసేన ఎంపీని మెప్పించింది. కాగా, పొత్తు విచ్ఛిన్నం అయిన దగ్గరి నుంచి భాజపా, శివసేన పార్టీల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాల విషయంలో ఆ రెండు పార్టీల మధ్య తీవ్రవైరం నడుస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని