Ayodhya: సాలగ్రామమై అవతరించిన శ్రీమహావిష్ణువు.. అయోధ్యకు చేరుకున్న వేళ..

అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహాన్ని రూపొందించేందుకు నేపాల్‌ నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చారు.

Updated : 02 Feb 2023 19:40 IST

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గర్భగుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహాన్ని రూపొందించేందుకు నేపాల్‌ నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చారు. 6 కోట్ల ఏళ్ల నాటి రెండు సాలగ్రామ శిలలు బుధవారం రాత్రి అయోధ్యకు చేరుకున్నాయి. ఒక రాయి 26టన్నులు, మరొకటి 14 టన్నుల బరువు ఉన్నట్లు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఇంఛార్జ్‌ ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. ఈ శిలలకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పురాతన రాళ్లు నేపాల్‌ నుంచి రెండు వేర్వేరు ట్రక్కులపై అయోధ్యకు తీసుకొచ్చారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతి నాటికి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేస్తామని తెలిపారు. నేపాల్‌లోని ముస్తాంగ్‌ జిల్లాలో సాలగ్రామ ప్రాంతానికి సమీపంలో గండకీ నది నుంచి ఈ రాళ్లను తీసుకువచ్చారు. ఇవి అత్యంత అరుదైన శిలలని ప్రకాశ్ గుప్తా తెలిపారు.

సాలిగ్రామమంటే..

వీటిని సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శిలలని భక్తుల ప్రగాఢవిశ్వాసం. నేపాల్‌లోని గండకీ నదిలో ఇవి విస్తృతంగా లభ్యమవుతాయి. అర్చనాదుల కోసం స్వామివారు సాలగ్రామంగా అవతరించనట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. పంచాయతన పూజలో విష్ణుమూర్తి రూపంగా సాలగ్రామాలను పూజిస్తారు.వీటిని కొనగూడదని దానంగా స్వీకరించాలని పెద్దల మాట. ఇక సాలగ్రామంపై ఉన్న చక్రాలను బట్టి పలు పేర్లతో పిలుస్తారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని