Odisha: కళ్లు చెదిరే జగన్నాథుడి ఖజానా!

ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు.

Updated : 10 Jul 2024 13:03 IST

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ భాండాగారం
ఈ నెల 14న తెరవాలని ప్రభుత్వానికి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ సిఫార్సు
ఆభరణాల లెక్కింపు, మరమ్మతులకు మార్గదర్శకాలు

వివరాలు వెల్లడిస్తున్న జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌

భువనేశ్వర్, గోపాల్‌పూర్‌ - న్యూస్‌టుడే: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై వివాదాలెన్నో! అసలు తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. చివరకు కొత్త ప్రభుత్వం దాన్ని తెరవాలని నిర్ణయించింది. సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టనున్నారు. భాండాగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ రెండో దఫా సమావేశం మంగళవారం పూరీలో జరిగింది. 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జస్టిస్‌ రథ్‌ విలేకరులతో మాట్లాడుతూ భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. రథయాత్ర పనిభారం వల్ల శ్రీక్షేత్ర పాలనాధికారి భాండాగారం డూప్లికేట్‌ తాళపుచెవిని కలెక్టరేట్‌లోని ట్రెజరీ నుంచి తీసుకురాలేదని, ఆయన 14న తమకు అందజేస్తారన్నారు. దాంతో తెరుచుకోకపోతే తాళంకప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు చెప్పారు.

మాది పర్యవేక్షణ బాధ్యతే 

‘జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం. మా కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదు. మేం కేవలం పర్యవేక్షిస్తాం. భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదు. ఈ సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కిస్తాం. మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమ’ని జస్టిస్‌ రథ్‌ వివరించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతాం. ఇది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేం. అప్పటి వరకూ సంఘం సభ్యులందరూ శాకాహారం భుజిస్తూ, నియమ నిష్టలతో ఉంటారు. స్వామివారి దర్శనాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ పాలకవర్గం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయ’ని జస్టిస్‌ రథ్‌ పేర్కొన్నారు.

1978లో చివరిసారి తెరిచిన భాండాగారం 

పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా, 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి, వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్‌ 6న నాటి నవీన్‌ పట్నాయక్‌ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా, రహస్య గది తాళపుచెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్‌ రఘువీర్‌దాస్‌ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్‌ తాళపుచెవి పూరీ కలెక్టరేట్‌ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో భాజపా ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని