Ravindra Jadeja: భార్యను ప్రశంసించి.. విమర్శలు ఎదుర్కొంటోన్న క్రికెటర్‌

క్రికెటర్ రవీంద్ర జడేజాకు నెట్టింట్లో ట్రోల్స్ ఎదురవుతున్నాయి. తన భార్య మాటలకు మద్దతు పలికి విమర్శల్లో చిక్కుకున్నారు. 

Updated : 29 Dec 2022 12:57 IST

గాంధీనగర్‌: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తన భార్యపై ప్రశంసలు కురిపించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా విజయం సాధించారు. భాజపా టికెట్‌పై జామ్‌ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

దీనిపై జడేజా స్పందిస్తూ.. ‘ఆఎస్‌ఎస్‌ గురించి నీకున్న పరిజ్ఞానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. భారత సంప్రదాయాలు, సమాజంలోని విలువలను నిలబెట్టే ఆదర్శాలను ప్రోత్సహించే సంస్థ అది. కృషి, నైపుణ్యాలతో ఇలాగే ముందుకువెళ్లు’ అంటూ తన సతీమణిపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత మరో ట్వీట్‌లో ‘ఇండియన్‌’ అంటూ జాతీయ జెండా చిహ్నాన్ని షేర్ చేశారు.

కాగా జడేజా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. దర్యాప్తు సంస్థల భయంతో నటులు, క్రీడాకారులు ఇలా ప్రతిఒక్కరూ భాజపాను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ‘ఈ దేశం మొత్తాన్నిభాజపా స్వాధీనం చేసుకుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా నియమితులైన తర్వాత క్రికెట్‌ రంగం వాళ్లపరమైంది. దేశంలో ఓ అగ్రనేత కుమారుడు కావడం మినహా బీసీసీఐ సెక్రటరీగా ఉండటానికి జైషాకు ఉన్న అర్హతలేంటి?’ అని మరో కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. ఆయన(జడేజాను ఉద్దేశించి) రాజకీయాల్లో చేరారా..? లేక భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ ముందు బీసీసీఐ మోకరిల్లిందా..? అని కొందరు నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని