Demonetisation: ఆ CCTV పుటేజీలు అలాగే ఉంచండి!

నోట్ల రద్దు చేసిన కాలంలో బ్యాంకుల్లో రికార్డయిన సీసీటీవీ పుటేజీను అలాగే భద్రపరచాలని అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

Published : 08 Jun 2021 22:14 IST

బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ

ముంబయి: నోట్ల రద్దు చేసిన కాలంలో బ్యాంకుల్లో రికార్డయిన సీసీటీవీ పుటేజీను అలాగే భద్రపరచాలని అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. నవంబర్‌ 8, 2016 నుంచి డిసెంబర్‌ 30, 2016 మధ్య కాలంలో సీసీటీవీ పుటేజీతో పాటు కరెన్సీ చెస్ట్‌లను కూడా నిల్వ ఉంచాలని పేర్కొంది. నోట్ల రద్దు సమయంలో అవకతవకల పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడానికి జరుపుతున్న దర్యాప్తు సంస్థలకు సహకరించే ఉద్దేశంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ వాటిని అలాగే ఉంచాలని స్పష్టంచేసింది.

దేశంలో పాత రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ 2016, నవంబర్‌ 8 ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాత నోట్లను తమ ఖాతాల్లో జమచేయాలని సూచించింది. అనంతరం రూ.500, రూ.2వేల కరెన్సీ నోట్లను విడుదల చేసి, వాటిని మార్చుకునే ప్రక్రియ చేపట్టింది. దీంతో బ్యాంకుల వద్ద భారీ స్థాయిలో ప్రజలు క్యూ కట్టారు. అదే సమయంలో కొందరు అక్రమంగా కొత్త నోట్లను సమీకరించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అలాంటి వాటిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయి. అందుచేత సదరు దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు బ్యాంకులలోని సీసీటీవీ పుటేజీలను తొలగించవద్దని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగానే వాటిని భద్రపరచాలని మరోసారి బ్యాంకులకు సర్క్యులర్‌ జారీ చేసింది.

ఇకపోతే, నోట్ల రద్దు సమయానికి దాదాపు రూ.15.41లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.వెయ్యి కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నట్లు అంచనా. అయితే, నోట్ల రద్దు ముగిసేనాటికి రూ. 15.31లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని