Drone attack: అరే.. పాక్‌ దొరికేసింది అలా..!

జమ్ములో జరిగిన డ్రోన్‌ దాడి వెనుకాల పాక్‌ పాత్ర ఉన్నట్లు బలపర్చే ఆధారాలు బయటపడ్డాయి. వీటిని కప్పిపెట్టుకోవడానికి పాక్‌ కొత్త డ్రామకు తెరతీసింది. తమ అభిమాన లష్కరే నేత హఫీజ్‌ సయిద్‌పై జూన్‌ 23 జరిగిన దాడిలో

Updated : 06 Jul 2021 11:45 IST

ఆర్డీఎక్స్‌ను గుర్తించిన దర్యాప్తు బృందాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

జమ్ములో జరిగిన డ్రోన్‌ దాడి వెనుక పాక్‌ పాత్ర ఉన్నట్లు బలపర్చే ఆధారాలు బయటపడ్డాయి. వీటిని కప్పిపుచ్చుకోవడానికి పాక్‌ కొత్త డ్రామాను రక్తికట్టిస్తోంది. తమ అభిమాన లష్కరే నేత హఫీజ్‌ సయీద్‌పై జూన్‌ 23న జరిగిన దాడిలో భారత్‌ హస్తం ఉందంటూ ఆరోపణలు మొదలుపెట్టింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ మరో రెండడుగులు ముందుకేసి.. భారత్‌ ఉగ్రవాదులకు నిధులు అందిస్తోందని.. ఎఫ్‌ఏటీఎఫ్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ కూడా చేశారు. ఇదంతా భారత వాయుసేన స్థావరంపై జరిగిన దాడి నుంచి ప్రపంచ దేశాల దృష్టి మళ్లించే వ్యూహంలా కనిపిస్తోంది.

దాడికి చైనా డ్రోన్‌.. పాక్‌ ఆర్డీఎక్స్‌..?

జమ్ము దాడికి వాడిన పేలుడు పదార్థాల మిశ్రమాల్లో ఆర్డీఎక్స్‌, నైట్రేట్‌ ఉన్నట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలల్లో గుర్తించారు. భారత్‌లో ఆర్డీఎక్స్‌ ఎక్కడా లభించదు. దీనిని పాకిస్థాన్‌ నుంచి తెప్పించాల్సిందే. ఈ ఒక్క పదార్థమే పాక్‌ పాత్రను తెలియజేస్తోంది. ఈ దాడికి చైనాలో తయారైన జీపీఎస్‌ డ్రోన్‌ వాడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాడికి వాడిన రెండు బాంబుల్లో ఒకటి పెద్దదిగా ఉంది. దీనిని వైమానిక స్థావరాల్లో కట్టడాలను ధ్వంసం చేయడానికి సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు. ఇక రెండో బాంబు మనుషులను లక్ష్యంగా చేసుకొని తయారు చేసినట్లు చెబుతున్నారు. ఎందుకంటే తొలి పేలుడు తర్వాత అక్కడికి వచ్చేవారు మరణించాలనే లక్ష్యంతో దానిలో ఎక్కువగా బాల్‌బేరింగ్‌ గుండ్లు, మేకులు వంటివి ఉంచారు. ఈ ఆధారాలన్నీ లష్కరే తొయిబా పాత్రను చెప్పకనే చెబుతున్నాయి. ఎందుకంటే పాక్‌ సైన్యంలో అప్రకటిత భాగంగా ఆ సంస్థకు పేరుంది. అందుకే సైన్యం ఈ స్థాయి పేలుడు పదార్థాలు, ఆయుధాలను దానికి సమకూరుస్తోంది. జమ్ముకశ్మీర్‌ డీజీపీ దల్బీర్‌ సింగ్‌ కూడా లష్కరే వైపే వేలెత్తి చూపారు.

గల్వాన్‌ హడావుడిలో ఉండగా.. డ్రోన్ల శక్తి పెంచుకొని..

గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు, ఆయుధాలు సమకూర్చుకొనే హడావుడిలో భారత్‌ ఉండగా.. మరోవైపు పాక్‌ మాత్రం డ్రోన్ల శక్తిని పెంచుకోవడం మొదలుపెట్టినట్లు సమాచారం. టర్కీ, చైనా నుంచి భారీ ఎత్తున చిన్నసైజు మానవరహిత విమానాలు కొనుగోలు చేసినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. పాక్‌ సైన్యం ‘సూపర్‌కామ్‌ 250’ అనే మానవ రహిత విమానంతో నిఘా, సమాచార సేకరణ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జూన్‌ 24వ తేదీన నెస్‌కామ్‌ బుర్రాక్‌ మానవ రహిత విమానంతో ఒక లేజర్‌ గైడెడ్‌ క్షిపణిని ప్రయోగించి పరీక్షించింది. పలు రక్షణ, శాస్త్ర సాంకేతిక విభాగాలు ఈ పరీక్షల్లో పాల్గొన్నాయి.

ఈ ఏడాది మే 31 - జూన్‌11 మధ్యలో పాక్‌ వ్యూహాత్మక ప్రణాళిక విభాగం, ఇన్‌స్పెక్షన్‌  టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ విభాగం సభ్యులు టర్కీకి వెళ్లివచ్చారు. వీరు అక్కడ ఎం.ఎస్‌. బేరక్తర్‌ కుటుంబానికి చెందిన డ్రోన్ల ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం బేరక్తర్‌ వీటీ ఓఎల్‌, టీబీ2 రకం డ్రోన్లను పాక్‌లోనే తయారు చేసే అంశంపై చర్చించారు. ఆ తర్వాత జర్మనీకి చెందిన ఆర్టోస్‌ డ్రోన్‌ రక్షణ వ్యవస్థ కొనుగోలుకు పాక్‌ డ్రోన్‌ రెగ్యులేటరీ అథారిటీ చర్యలు చేపట్టింది. జామింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ వ్యవస్థ డ్రోన్ల రాకపోకలను గమనిస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ త్రివిధ దళాల సభ్యులు, ఇతరశాఖల బృందాలు చైనాలోని నోర్నికో ఫ్యాక్టరీ సందర్శనకు వెళ్లాయి. ఇక్కడ గగనతల యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను తయారు చేస్తారు. వీటిల్లో డ్రోన్లు కూడా ఉన్నాయి.

భారత్‌పైనే ఆరోపణలు..   

ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ ఆరోపించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న భారత్‌ విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు. లాహోర్‌లోని జోహార్‌ టౌన్‌లో లష్కరే తొయిబా నేత హఫీజ్‌ సయీద్‌పై దాడికి న్యూదిల్లీనే నిధులు సమకూర్చిందని ఆరోపించారు. పాక్‌లో శాంతిభద్రతలకు భారత్‌ భంగం కలిగిస్తోందన్నారు. పాకిస్థాన్‌ మరోసారి భారత్‌  ఉగ్రకార్యకలాపాలపై గొంతు విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కానీ, అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్‌ వాదనను తేలిగ్గా తీసుకుంటోందని వాపోయారు.

హఫీజ్‌ సయీద్‌కు, మరో ఉగ్రవాది జకీర్‌ ఉర్‌ రెహ్మాన్‌కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇటీవల రెహ్మాన్‌ తన ముఠా సభ్యులను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు తరలించారు. ఆ తర్వాత ఈ దాడి చోటు చేసుకొంది.  ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఈద్‌గుల్‌ అనే వ్యక్తి అఫ్గాన్‌ జాతీయుడని పాక్‌ జాతీయ భద్రతా సలహాదారు యూసఫ్‌ పేర్కొన్నారు. వాస్తవానికి భారత్‌లో కూరగాయల మార్కెట్ల వలే పాకిస్థాన్‌లో ఆయుధ మార్కెట్లు ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. 30 కిలోల పేలుడు పదార్థాలు, కారు సంపాదించడం అక్కడ అత్యంత తేలికైన పని. పరస్పర దాడులు ఉగ్రసంస్థలకు అక్కడ సర్వసాధారణమే. ఇన్ని ఆరోపణలు చేసిన పాకిస్థాన్‌ ఎటువంటి ఆధారాలను మాత్రం చూపలేదు. లోతైన దర్యాప్తు చేస్తామని చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని