
కేంద్రం ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధమే: టికాయిత్
దిల్లీ: నూతన సాగు చట్టాల విషయంలో కేంద్రం ఆహ్వానిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. జనవరి 22న కేంద్రం చర్చల్ని ఎక్కడైతే నిలిపివేసిందో.. తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
‘సాగు చట్టాల విషయంలో కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం కావాలి. దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నాయకుల్ని కేంద్రం చర్చలకు ఆహ్వానించాలి. కేంద్రం చర్చల్ని జనవరి 22న ఎక్కడైతే ముగించిందో.. తిరిగి అక్కడి నుంచే మళ్లీ చర్చలు ప్రారంభం కావాలి. మూడు నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలనేదే మా డిమాండ్. ఆ డిమాండ్లు యథాతథంగా ఉంటాయి. అంతేకాకుండా రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలి’ అని రాకేశ్ ప్రకటనలో వెల్లడించారు. హరియాణాలో కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో హోంమంత్రి అనిల్ విజ్ రైతులతో తిరిగి చర్చలు ప్రారంభించాలని కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను ఇటీవల కోరారు. ఈ క్రమంలోనే టికాయిత్ చర్చలను పునఃప్రారంభించాలంటూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై నిరసన చేస్తున్న రైతులతో కేంద్రం పలు దఫాల వారీగా చర్చలు నిర్వహించినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. దీంతో రైతులు ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.