Maharashtra Crisis: శిందే శిబిరంలో 50 మంది ఎమ్మెల్యేలు..!

మహారాష్ట్రలో రాజకీయం కాకపుట్టిస్తోంది. శివసేన రెబల్‌ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా శిందే క్యాంప్‌లో చేరిన వారి సంఖ్య 50కు చేరుకొన్నట్లు సమాచారం. వారిలో దాదాపు 40 మంది శివసేనకు

Updated : 24 Jun 2022 10:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్రలో రాజకీయం కాకపుట్టిస్తోంది. శివసేన రెబల్‌ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా శిందే క్యాంప్‌లో చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. వారిలో దాదాపు 40 మంది శివసేనకు చెందిన వారే అని శిందే ఓ అంగ్లవార్త సంస్థకు స్వయంగా వెల్లడించారు. ‘‘మాపై నమ్మకం ఉన్నవారు చేతులు కలపొచ్చు. మేము బాలా సాహెబ్‌ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తాం.’’ అని పిలుపునిచ్చారు.

మా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన నోటీసులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని శిందే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వారు నిన్న చేసింది చట్టవ్యతిరేకం. వారికి ఆ హక్కు లేదు. మేము మెజార్టీ ఉన్నవాళ్లం. ప్రజాస్వామ్యంలో అంకెలు చాలా కీలకం. వారికి సస్పెండ్‌ చేసే హక్కు కూడా లేదు’’ అని ఆయన వెల్లడించారు.  ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు.. ఏక్‌నాథ్‌ శిందేను తమ నాయకుడిగా పేర్కొంటూ గవర్నర్‌, డిప్యూటీ స్పీకర్‌కు లేఖలు రాశారు. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌  దాఖలు చేసిన కొద్దిసేపటికే ఈ లేఖలు వెళ్లడం గమనార్హం.

కీలక సమయంలో బలప్రదర్శనకు కూడా శిందే వర్గం సిద్ధమవుతోంది. ఆ వర్గంలోని ఎమ్మెల్యే దీపక్‌ కేసర్కర్‌ మాట్లాడుతూ తాము అవసరమైన సమయంలో పార్టీ ఛైర్మన్‌ (ఏక్‌నాథ్‌) చెప్పినప్పుడు గవర్నర్‌ ఎదుట లేదా స్పీకర్‌ వద్ద  బలప్రదర్శనకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉంటే తమను ఒత్తిడికి గురిచేసి లొంగదీసుకొనే వ్యూహాలు పన్నుతారనే గువహాటీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్న ఉద్ధవ్‌..

శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ  జిల్లా అధ్యక్షులతో నేడు భేటీ కానున్నారు. మరో వైపు శిందే వర్గం ఇప్పటికే 400 మాజీ కార్పొరేటర్లతో భేటీ అయిన నేపథ్యంలో ఉద్ధవ్‌ ఈ నిర్ణయం తీసుకోన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీలు కూడా ఉద్ధవ్‌ నుంచి చేజారవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడేందుకు ఉద్ధవ్‌ జిల్లా అధ్యక్షులతో భేటీ ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని