Google: 27వేల ఫిర్యాదులు.. 59వేల కంటెంట్ల తొలగింపు  

స్థానిక చట్టాలు, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో తమకు భారత యూజర్ల నుంచి 27,700లకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ తెలిపింది.

Published : 01 Jul 2021 01:22 IST

దిల్లీ: స్థానిక చట్టాలు, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో తమకు భారత యూజర్ల నుంచి 27,700లకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ తెలిపింది. వీటి ఫలితంగా 59వేలకు పైగా కంటెంట్లను తమ సైట్‌ నుంచి తొలగించినట్లు పేర్కొంది. ఈ మేరకు తొలి నెలవారీ పారదర్శక నివేదికను గూగుల్‌ బుధవారం వెల్లడించింది.

సామాజిక మాధ్యమాలకు సంబంధించి నూతన ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. ఆయా సంస్థలు అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు వంటి వివరాలను నెలకోసారి అందజేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ వివరాలతో కూడిన నివేదికను విడుదల చేసిన తొలి డిజిటల్ వేదిక గూగుల్‌. 

‘‘ప్రపంచవ్యాప్తంగా మాకు వచ్చే అన్ని రకాల ఫిర్యాదులు, వినతులు.. వాటిపై మా స్పందన వంటి వివరాలకు సంబంధించి గూగుల్‌ సుదీర్ఘకాలం నుంచే పారదర్శక నివేదిక రూపొందిస్తోంది. 2010 నుంచి ఉన్న మా ట్రాన్స్‌పరెన్సీ నివేదికలో వీటికి సంబంధించి సమాచారమంతా ఉంది. అయితే నూతన ఐటీ(భారత) నిబంధనలకు అనుగుణంగా తొలిసారి నెలవారీ నివేదికను విడుదల చేశాం’’ అని గూగుల్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో గూగుల్‌, యూట్యూబ్‌కు భారత యూజర్ల నుంచి 27,762 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా 96శాతం కాపీరైట్‌కు సంబంధించినవే. ఇక ట్రేడ్‌మార్క్‌కు సంబంధించి 357, పరువు నస్టానికి సంబంధించి 275 ఫిర్యాదులు వచ్చినట్లు గూగుల్‌ నివేదికలో వెల్లడించింది. ఈ ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం 59,350 కంటెంట్లను తమ వేదికల నుంచి తొలగించినట్లు కంపెనీ పేర్కొంది.

వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం... కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలను ప్రకటించింది. అవన్నీ తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే... దిగ్గజ సామాజిక వేదిక(50 లక్షల రిజిస్టర్డ్‌ వినియోగదారులున్నవి... ట్విటర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటివి)లకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో మే 26 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలను పాటించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ట్విటర్‌ మాత్రం కొత్త నిబంధనలు అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థ భారత్‌లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయింది. మరోవైపు జులై 15న నెలవారీ పారదర్శక నివేదికను విడుదల చేస్తామని సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నిన్న వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని