Covid Wave: కరోనా కేసుల పెరుగుదల.. మరో వేవ్‌కు సంకేతమా..?

ఒమిక్రాన్‌ ఉపరకాలు వెలుగు చూస్తున్నాయని నివేదికలు వస్తోన్న వేళ పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Published : 18 Apr 2022 19:40 IST

నిపుణులు ఏం చెబుతున్నారంటే

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుతోందని భావిస్తోన్న తరుణంలో రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. మొన్నటివరకు నిత్యం వెయ్యికి దిగువన నమోదైన కేసుల సంఖ్య ప్రస్తుతం 2వేలు దాటింది. ఒమిక్రాన్‌ ఉపరకాలు వెలుగు చూస్తున్నాయని నివేదికలు వస్తోన్న వేళ పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్‌ విజృంభణ మరో వేవ్‌కు కారణమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసుల సంఖ్య స్వల్పంగా పెరగడం మరో వేవ్‌కు (Fourth Wave) దారితీయకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొత్తవేవ్‌ వచ్చినా ప్రభావం తక్కువే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

నాలుగో వేవ్‌ తీవ్రత తక్కువే..

ప్రస్తుతం కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల చూస్తుంటే నాలుగో వేవ్‌ వచ్చే సంభావ్యత తక్కువేనని ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మనీంద్ర అగర్వాల్‌ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా దేశంలో కరోనా విజృంభణపై ముందస్తు అంచనాలు వేస్తోన్న ఆయన.. ఆంక్షల తొలగింపు వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని అన్నారు. ‘రెండో వేవ్‌లో ఎక్కువ సంఖ్యలో వైరస్‌ బారినపడడంతోపాటు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ విస్తృతంగా పంపిణి జరిగింది. దీంతో కొత్త వేరియంట్ల వ్యాప్తికి అంతగా ఆస్కారం ఉండకపోవచ్చు. వైరస్‌ వ్యాప్తిని మరింత పరిశీలించిన తర్వాతే ఓ అంచనాకు రావాలి. చాలా దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరిగినప్పటికీ వెంటనే తగ్గుముఖం పట్టాయి’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనీంద్ర అగర్వాల్‌ పేర్కొన్నారు. వేవ్‌ విషయం పక్కనబెడితే వైరస్‌ వ్యాప్తి నివారణపై ప్రభుత్వాలు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉండాలన్నారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేనప్పటికీ ప్రజలు, ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.

ఇప్పుడే అంచనా వేయలేం..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తుంటే మరో వేవ్‌కు ఇవి కారణం కాకపోవచ్చని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సభ్యుడు డాక్టర్‌ జేపీ ములియిల్‌ పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నమోదవుతోన్న కేసులు ఒకశాతం (పాజిటివిటీ రేటు) కంటే తక్కువే. వీటిని ఆధారంగా చేసుకొని కొత్త వేవ్‌పై అంచనాలు వేయలేం. మూడోవేవ్‌ సమయంలోనూ విద్యార్థులు కరోనా బారినపడడం, ఆస్పత్రి చేరికలు పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం చూస్తోన్న ఈ స్వల్ప పెరుగుదల కొత్త వేరియంట్ వల్ల కాదు. కేవలం ఒమిక్రాన్‌ కారణంగానే కేసులు పెరుగుతున్నాయ్‌’ అని డాక్టర్‌ ములియిల్‌ వెల్లడించారు.

రాష్ట్రాలు అలెర్ట్‌..

గడిచిన వారం రోజులుగా దేశంలో పలుచోట్ల కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దిల్లీ, యూపీ, కేరళ, గుజరాత్‌, హరియాణాతోపాటు మిజోరం రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశరాజధాని దిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గడిచిన 15రోజులుగా వైరస్‌ వ్యాప్తిలో 500శాతం పెరుగుదల కనిపించినట్లు ఓ సర్వే పేర్కొంది. ఇదే సమయంలో దేశంలో రోజువారీ కేసుల సంఖ్య 2వేలు దాటింది. పాజిటివిటీ రేటు 0.31శాతం నుంచి 0.83శాతానికి పెరగగా.. దిల్లీలో మాత్రం 5శాతం దాటింది. ఇలా దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరగడంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ.. ఇప్పటికే నిపుణులతో సమీక్ష నిర్వహించింది. కొవిడ్‌ వేరియంట్లపై అన్ని రాష్ట్రాలు పర్యవేక్షణ చేయాలని సూచించింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

కేసుల పెరుగుదలకు కారణం అదే..?

దిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలకు కచ్చితమైన కారణాలు లేనప్పటికీ మాస్కులు ధరించడం వంటి కొవిడ్‌ ఆంక్షలు సడలించడం వల్లే కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. విద్యా సంస్థలతోపాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడమూ ఇందుకు మరో కారణంగా పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని భావిస్తోన్న సమయంలో మరోసారి కొవిడ్‌ ఆంక్షలకు ఆయా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని