US visa: అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!

గతేడాది రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు జారీ చేయగా.. ఈసారి కూడా ఆ సంఖ్య  అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది.

Published : 14 Jun 2024 00:09 IST

దిల్లీ: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు జారీ చేయగా.. ఈసారి కూడా అదేస్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిదో విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని నిర్వహించిన భారత్‌లోని అమెరికా ఎంబసీ.. దిల్లీ, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి కేంద్రాల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు మొదలు పెట్టింది. దీంతో దేశ రాజధానిలోని యూఎస్‌ ఎంబసీ వెలుపల భారీ క్యూ కనిపించింది.

అమెరికా వర్సిటీల్లో చేరికపై ఆసక్తి చూపిస్తున్న భారత విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే అగ్రరాజ్యం కూడా వీసాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. గత ఏడాది రికార్డు స్థాయిలో లక్షా 40వేల విద్యార్థి వీసాలను జారీ చేసింది. మరే దేశానికి ఈ స్థాయిలో వీసాలు ఇవ్వలేదు. 2018, 2019, 2020ల్లో కలిపి ఇచ్చిన సంఖ్య కంటే 2023లోనే అధిక వీసాలు జారీ చేయడం గమనార్హం.

ఇదే విషయంపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ తాత్కాలిక కాన్సుల్‌ జనరల్‌ సయ్యద్‌ ముజ్‌తబా అంద్రాబీ మాట్లాడుతూ.. 2023తో పోలిస్తే ఈ ఏడాది కూడా వీటి సంఖ్య అదే మాదిరిగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చన్నారు. వీటిపైనే ప్రధాన దృష్టి సారించామన్న ఆయన.. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్‌ కార్యాలయాల్లో ముమ్మరంగా కృషి చేస్తున్నామని చెప్పారు. విద్యార్థి వీసాలకు అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తుందని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల ప్రజాసంబంధాలు కలకాలం ఉంటాయన్న విషయం తమకు తెలుసునన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని