Lok Sabha: పార్లమెంటు చరిత్రలో ఇది ఎన్నడూ చూడనిది..: కాంగ్రెస్‌

లోక్‌సభ స్పీకర్‌ నుంచి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంట్‌ చరిత్రలో ఎన్నడూ జరగలేదని ‘ఎమర్జెన్సీ’ని ఉద్దేశించి కాంగ్రెస్‌ పేర్కొంది.

Published : 27 Jun 2024 17:24 IST

దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘ఎమర్జెన్సీ (Emergency)’పై ఓం బిర్లా చదివిన తీర్మానం లోక్‌సభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ (Lok Sabha)లో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం స్పీకర్‌ వద్ద ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు.. సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ జరగలేదని కాంగ్రెస్‌ పేర్కొంది.

‘‘విపక్ష నేతగా గుర్తింపు పొందిన అనంతరం రాహుల్ గాంధీ ‘ఇండియా’ కూటమి నేతలతో కలిసి తొలిసారి స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటు పనితీరు గురించి చాలా అంశాలు చర్చకు వచ్చాయి. స్పీకర్‌ ‘ఎమర్జెన్సీ’ ప్రస్తావన తీసుకురావడాన్ని రాహుల్‌ లేవనెత్తారు. ఇది రాజకీయపరమైన అంశమని, దీనిని నివారించి ఉండొచ్చని చెప్పారు’’ అని కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. మరోవైపు.. ఆయన కూడా స్పీకర్‌కు ఈ వ్యవహారంపై ఓ లేఖ రాశారు.

సభలో ‘ఎమర్జెన్సీ’ దుమారం

‘‘పార్లమెంట్‌ విశ్వసనీయతపై ప్రభావం చూపుతోన్న ఓ తీవ్రమైన అంశం నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నాను. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీని మీరు ప్రస్తావించడం దిగ్భ్రాంతికరం. సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ చూడనిది. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేయడంపై కాంగ్రెస్ తరఫున ఆందోళన వ్యక్తం చేస్తున్నాను’’ అని కేసీ వేణుగోపాల్‌ తన లేఖలో పేర్కొన్నారు.

‘‘1975 జూన్‌ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. పలువురు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. మీడియాపై ఆంక్షలు విధించింది. న్యాయ వ్యవస్థపైనా నియంత్రణలు అమలు చేసింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈ సభ బాబాసాహెబ్‌ రాజ్యాంగాన్ని రక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని హామీ ఇస్తున్నా’’ అని స్పీకర్‌ బుధవారం పేర్కొన్నారు. స్పీకర్‌ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్‌ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని