Supertech: ఇళ్ల కొనుగోలుదార్లకు జనవరి 17లోగా డబ్బులు తిరిగివ్వాలి.. లేదా జైలుకే..!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 40 అంతస్తుల జంట భవనాలను(ట్విన్‌ టవర్స్‌) కూల్చివేసే విషయంలో ఆ భవనాల నిర్మాణ సంస్థ సూపర్‌టెక్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Published : 12 Jan 2022 23:00 IST

సూపర్‌టెక్‌ సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో 40 అంతస్తుల జంట భవనాలను(ట్విన్‌ టవర్స్‌) కూల్చివేసే విషయంలో ఆ భవనాల నిర్మాణ సంస్థ సూపర్‌టెక్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్ల కొనుగోలుదారులకు జనవరి 17లోగా డబ్బును తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. 

నిబంధనలు ఉల్లంఘిస్తూ నొయిడాలోని సెక్టార్‌ 93లో సూపర్‌టెక్‌ సంస్థ నిర్మించిన ట్విన్ టవర్స్‌ను అక్రమ నిర్మాణాలని సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తేల్చిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. 3 నెలల్లోగా వాటిని కూల్చివేయాలని ఆదేశించింది. ఈ మేరకు గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కూల్చివేత ఖర్చు మొత్తాన్ని సూపర్‌టెక్‌ భరించాలని ఆదేశాలు జారీచేసింది. అంతేగాక, రెండు టవర్లలో దాదాపు వెయ్యి ఫ్లాట్లు ఉండగా.. వాటిని కొన్న వారందరికీ రెండు నెలల్లోగా 12శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

అయితే కోర్టు ఇచ్చిన గడువు ముగిసి రెండు నెలలు పూర్తయినా ఇళ్ల కొనుగోలుదారులకు సూపర్‌టెక్‌ సంస్థ ఇప్పటికీ డబ్బు చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు నేడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీ డైరెక్టర్లను జైలుకు పంపిస్తాం. సుప్రీంకోర్టుతోనే చెలగాటమాడుతున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించేందుకు అన్ని కారణాలు వెతుక్కుంటున్నారు. జనవరి 17లోగా ఇళ్ల కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించాలి. లేదంటే తర్వాత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని