Updated : 24 Dec 2020 13:16 IST

కరోనా: ఆ దేశ ప్రధానిపై రూ.900కోట్ల దావా

రోమ్‌: ఇటలీలో కొవిడ్-19 మృతుల బంధువులు ఆ దేశ ప్రధానిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం 500 మంది కలిసి ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వంపై దావా వేశారు. తమకు జరిగిన నష్టానికి 100 మిలియన్‌ యూరోలు(దాదాపు రూ.900 కోట్లు) పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారు తమ దావాలో ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటే, ఆరోగ్యశాఖ మంత్రి రోబర్టో స్పెరాంజా, లాంబార్డీ ప్రాంత గవర్నర్‌ అట్టిలియో ఫొంటానా పేర్లను చేర్చారు. మొదటిసారి కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరవాత దాని కారణంగా అత్యధికంగా ప్రభావితమైన పాశ్చాత్య దేశాల్లో ఇటలీ ముందుంది. ఫిబ్రవరిలో ఆ దేశంలో వైరస్‌ ఉనికిని గుర్తించగా.. ఇప్పటివరకు 70 వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఐరోపా పరంగా చూసుకుంటే మృతుల విషయంలో తొలిస్థానంలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో నిలిచింది. ఆ దేశం వైరస్‌తో ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయిందో ఈ లెక్కలే చెప్తున్నాయి. 

లాంబార్డీలో వైరస్‌తో తీవ్రంగా ఇబ్బంది పడిన బెర్గామో ప్రాంతానికి చెందిన 500 మంది తమ ఆప్తులను కోల్పోయారు. ఏప్రిల్‌లో వీరంతా ఓ బృందంగా ఏర్పడి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. తమకు జరిగిన నష్టంపై న్యాయ పోరాటం మొదలు పెట్టారు. ‘తమ బాధ్యతలు నిర్వర్తించని వారికి ఇది క్రిస్మస్ బహుమతి’ అంటూ ఈ బృందానికి నేతృత్వం వహిస్తోన్న లూకా ఫుస్కో ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ విజృంభిస్తోన్న సమయంలో లాక్‌డౌన్ విధించడంలో, అది తెచ్చిపెట్టిన ఆర్థిక నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సంసిద్ధత లేకపోవడం, ప్రణాళిక బద్ధంగా వ్యవహరించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అయితే, ఈ దావాపై ప్రధాని, ఆరోగ్య మంత్రి, గవర్నర్‌ అధికార ప్రతినిధులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఇటలీలో వైరస్ విజృంభణపై ఇప్పటికే ఆ దేశ ప్రధానిని కూడా ప్రాసిక్యూటర్లు ప్రశ్నించారు. 

ఇవీ చదవండి:

కరోనా ‘కొత్తరకం’..మరో రెండు దేశాల్లో

12 రోజు..400 దిగువనే మరణాలు

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts