Jacqueline Fernandez: రూ.200కోట్ల దోపిడీ కేసు.. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు బెయిల్‌

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)కు దిల్లీ కోర్టులో ఊరట లభించింది.

Updated : 26 Sep 2022 15:16 IST

దిల్లీ: రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)కు దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో పాటియాలా హౌస్‌ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 26న కోర్టు ఎదుట హాజరుకావాలంటూ నటికి సమన్లు జారీ చేసింది. దీంతో జాక్వెలిన్‌ సోమవారం పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే బెయిల్‌ కోసం నటి తరఫు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం దీనిపై ఈడీ నుంచి స్పందన కోరింది. రెగ్యులర్‌ బెయిల్‌ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అప్పటివరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని జాక్వెలిన్‌ న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. రూ.50వేల పూచికత్తుపై జాక్వెలిన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది.

దాదాపు రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ (Sukesh Chandrashekar) నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంది. ఇటీవల దిల్లీ పోలీసులు కూడా ఈ కేసులో నటిని రెండు సార్లు విచారించారు. సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి ఆమె అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆమెను ఆరా తీశారు.

ఆ తర్వాత, జాక్వెలిన్‌ స్టైలిస్ట్‌ లేపాక్షి ఎల్లవాడిని కూడా దిల్లీ పోలీసులు, ఆర్థిక నేరాల విభాగం అధికారులు ప్రశ్నించారు. సుకేశ్‌తో జాక్వెలిన్‌ సన్నిహిత సంబంధం గురించి తనకు తెలుసునని లేపాక్షి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సుకేశ్‌ అరెస్టు వార్త తెలిసిన తర్వాత జాక్వెలిన్‌ అతడితో సంబంధాలు తెంచుకున్నారని ఆమె చెప్పినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని