Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి

అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కొన్ని గంటలు  చూసొచ్చేందుకు ఆప్‌ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు దిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. అయితే, ఇందుకు కొన్ని షరతులు విధించింది.

Published : 02 Jun 2023 17:30 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi Excise scam case)లో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ (AAP) నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)కు స్వల్ప ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసొచ్చేందుకు దిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆయనకు కొన్ని గంటలు అనుమతినిచ్చింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సిసోదియా తన ఇంటికెళ్లి భార్య సీమా (Seema)ను చూసిరావొచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా విధించింది. సిసోదియా తన వెంట ఎలాంటి గ్యాడ్జెట్స్‌ తీసుకెళ్లొద్దని, మీడియాతో మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ (CBI) అధికారులు సిసోదియా (Manish Sisodia)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో అప్పటి నుంచి ఆయన తిహాడ్‌ జైల్లో ఉంటున్నారు. కాగా.. సిసోదియా జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య సీమా ఆరోగ్యం క్షీణించింది.

ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ అనే అరుదైన సమస్యలతో బాధపడుతున్న సీమా ఆరోగ్య పరిస్థితి ఇటీవల క్షీణించడంతో గత నెల ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో భార్యను చూసేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని సిసోదియా పిటిషన్‌ దాఖలు చేశారు. కుమారుడు చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)ను ఆదేశించింది. అయితే, ఆ తర్వాత భార్య ఆరోగ్యం కాస్త మెరుగవ్వడంతో సిసోదియా తన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ కేసులో విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు.. సిసోదియాకు కొన్ని వెసులుబాటులు కల్పించింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యతో రోజు విడిచి రోజు గంట పాటు వీడియోకాల్‌ మాట్లాడుకునేందుకు అనుమతి కల్పించింది.

మరోవైపు, మద్యం కుంభకోణం (Liquor Scam) వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో సిసోదియా దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు ఇటీవల తిరస్కరించింది. ఆయనపై ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంటూ బెయిల్‌ (Bail) ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు ఇదే వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం సిసోదియా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని