కొవిడ్‌ మరణాలు తక్కువగా చూపారా? ఎల్‌ఐసీ డేటాపై ప్రభుత్వం ఏమంది..?

LIC IPO Data: సెకండ్‌వేవ్‌ సమయంలో ప్రభుత్వం లెక్కల్లో చూపిన కొవిడ్‌ మరణాల కంటే ఎక్కువే మరణాలు నమోదు అయి ఉంటాయని ఎల్‌ఐసీ డేటా చెబుతోందంటూ వచ్చిన కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.

Published : 20 Feb 2022 01:41 IST

దిల్లీ: కొవిడ్‌ రెండో వేవ్‌ యావత్‌ దేశాన్ని కుదిపేసింది. మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ మరణాల లెక్కలను తక్కువగా చూపుతున్నారంటూ ప్రభుత్వంపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఐపీవోకు సిద్ధమైన ఎల్‌ఐసీ డేటా దీనిపై మరోసారి చర్చకు దారితీసింది. 2021లో ప్రభుత్వం లెక్కల్లో చూపిన కొవిడ్‌ సంబంధిత మరణాల కంటే ఎక్కువగా ఉన్నాయని ఎల్‌ఐసీ డేటా చెబుతోందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీన్ని తాజాగా ప్రభుత్వం ఖండించింది. మరణాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసింది.

కొవిడ్‌ మరణాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కొవిడ్‌ మరణాల నమోదు విషయంలో సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఐపీవోలో భాగంగా పాలసీలు, సెటిల్‌మెంట్ల వివరాలను వెల్లడించిన ఎల్‌ఐసీ డేటాను ఆధారంగా చేసుకుని మరణాలు అంతకంటే ఎక్కువే ఉండొచ్చంటూ వచ్చిన కథనాలు ఊహాజనితమైనవిగా కొట్టిపారేసింది. అలాంటి వార్తలు నిరాధారమైనవిగా పేర్కొంది. వివిధ కారణాలతో మరణించిన వారి క్లెయిమ్‌లను ఎల్‌ఐసీ పరిష్కరిస్తుందని, దానికి ప్రభుత్వ లెక్కలతో లంకె కట్టడం వాస్తవ దూరంగా ఉందని తెలిపింది.

కొవిడ్‌ మరణాలకు సంబంధించి వివరాలను జన బాహుళ్యంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామన్న విషయాన్ని గుర్తించాలని కేంద్రం పేర్కొంది. కొవిడ్‌ మరణాలను వర్గీకరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానాన్నే ప్రభుత్వం అనుసరించిందని తెలిపింది. రాష్ట్రాలు సమర్పించిన డేటా ఆధారంగానే డేటాను వెలువరించినట్లు పేర్కొంది. కొవిడ్‌ గణాంకాలను సరైన రీతిలో సమర్పించాలని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచించిన విషయాన్నీ ఈ సందర్భంగా కేంద్రం ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ మరణాలు వంటి సున్నిత అంశాల్లో వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కేంద్రం సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని