Republic day: 25 శకటాలు.. 16 కవాతు విభాగాలు

ఈ ఏడాది దేశరాజధానిలో జరిగే గణతంత్ర వేడుకల ప్రధాన కార్యక్రమంలో 16 కవాతు విభాగాలు కనువిందు చేస్తాయి.

Updated : 23 Jan 2024 15:30 IST

కనువిందు చేయనున్న గణతంత్ర వేడుకలు 

దిల్లీ: ఈ ఏడాది దేశరాజధానిలో జరిగే గణతంత్ర వేడుకల ప్రధాన కార్యక్రమంలో 16 కవాతు విభాగాలు కనువిందు చేస్తాయి. ఇవి రాజ్‌పథ్‌పై ఠీవిగా, లయబద్ధంగా ముందుకు సాగుతూ వీక్షకులను ఆకట్టుకోనున్నాయి. వీటిలో సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు భాగస్వామ్యం కానున్నాయి. అలాగే 17 సైనిక బ్యాండ్‌లు, 25 శకటాలు కనువిందు చేయనున్నాయని భారత సైన్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

- సైన్యం తరఫున అశ్విక దళం, 14 మెకనైజ్డ్‌ విభాగాలు, ఆరు మార్చింగ్‌ కంటింజెంట్లు పాల్గొననున్నాయి. ఆర్మీకి చెందిన ఆరు ధ్రువ్‌ హెలికాప్టర్లు గగనయానం చేస్తాయి.  

- బంగ్లాదేశ్‌ ఏర్పాటుకు కారణమైన 1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పీటీ-76, సెంచూరియన్‌ ట్యాంకులు, ఓటీ-62, 75/24 శతఘ్నులతోపాటు పలు ఆయుధ వ్యవస్థలు, క్షిపణులు పాల్గొంటున్నాయి.  

- వివిధ రాష్ట్రాలు, శాఖలు, సైనిక దళాలకు చెందిన 25 ఆకర్షణీయ శకటాలు సందడి చేయనున్నాయి.  

- బీఎస్‌ఎఫ్‌కు చెందిన రెండు మహిళా బృందాలు, ఐటీబీపీకి చెందిన ఒక పురుష బృందం మోటారు సైకిళ్లపై సాహసోపేత విన్యాసాలు నిర్వహించనున్నాయి. 

అలనాటి తిరుగుబాటు ఇతివృత్తంగా..  

75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని ఈసారి నౌకాదళ శకటంపై 1946 నాటి నేవీ తిరుగుబాటు అంశం ఇతివృత్తంగా ఉంటుంది. నాడు బ్రిటిష్‌ సర్కారుపై తిరగబడ్డ భారతీయ నావికులు.. స్వాతంత్య్ర ఉద్యమానికి దోహదపడ్డారు. ఈ దఫా నేవీ మార్చింగ్‌ బృందానికి మహిళా అధికారి లెఫ్టినెంట్‌ కమాండర్‌ ఆంచల్‌ శర్మ నేతృత్వం వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని