
Republic Day: గణతంత్ర వేడుకల్లో భారీ మార్పు.. ఈసారి అరగంట ఆలస్యంగా..!
దిల్లీ: వరుసగా రెండో ఏడాది గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది కూడా వేడుకలను నిరాడంబరంగానే జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈసారి వేడుకల్లో భారీ మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రిపబ్లిక్ డే పరేడ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
సాధారణంగా ఏటా దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే పొగమంచు కారణంగా ఈ సారి ఉదయం 10.30 గంటలకు పరేడ్‌ను మొదలుపెట్టాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ‘‘జనవరి 26న దిల్లీలో మంచు దుప్పటి పరుచుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అందువల్ల ప్రేక్షకులు పరేడ్‌ను వీక్షించేందుకు వీలుగా అరగంట ఆలస్యంగా పరేడ్‌ను ప్రారంభించాలని నిర్ణయించాం. అంతేగాక, రాజ్‌పథ్ మార్గంలో రెండు వైపులా ఐదు ఎల్‌ఈడీ స్క్రీన్ల చొప్పున 10 ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేయనున్నాం’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
పరేడ్ ప్రారంభానికి ముందు ముందు గత గణతంత్ర దినోత్సవాలకు సంబంధించిన వీడియోలు, సాయుధ బలగాలపై తీసిన షార్ట్ ఫిల్మ్స్, ఇతర స్ఫూర్తిదాయక వీడియోలను ఈ ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత పరేడ్ మొదలవగానే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
వీక్షకుల సంఖ్యపై పరిమితి..!
కరోనా మహమ్మారి ముందు వరకు దిల్లీలో గణతంత్ర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. 2020లో జరిగిన వేడుకలకు 1.25లక్షల మందిని పరేడ్ చూసేందుకు అనుమతించారు. అయితే కొవిడ్ కారణంగా గతేడాది వీక్షకుల సంఖ్యపై పరిమితి విధించారు. గతేడాది ఆహ్వానితులు, సాధారణ ప్రజలంతా కలిపి 25వేల మందిని అనుమతించారు. ఎలాంటి విదేశీ నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించలేదు. తాజాగా ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా గణతంత్ర వేడుకలకు పరిమిత సంఖ్యలో వీక్షకులను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
దాదాపు 24వేల మందిని మాత్రమే పరేడ్‌కు అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 19వేల మంది ఆహ్వానితులు కాగా.. మిగతా వారు టికెట్లు కొనుక్కుని వచ్చే సాధారణ పౌరులు అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇక, ఈ ఏడాది కూడా ఏ దేశాధినేతలు కూడా ముఖ్య అతిథులుగా రావట్లేదని సమాచారం.
75 విమానాలతో విన్యాసాలు..
ఈ ఏడాదికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే గణతంత్ర వేడుకల్లో 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు ప్రదర్శించనుంది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. గగనతలంలో మొత్తం 15 ఆకృతులను ప్రదర్శించనున్నట్లు వాయుసేన అధికారులు వెల్లడించారు.
విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు శకటాల కవాతు సాగనుంది. ఈ సారి రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 21 శకటాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఉత్సవాలకు ఉగ్రముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పరేడ్ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతంలో మొత్తం 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.