ఉత్తరాఖండ్‌.. సహాయక చర్యలకు ఆటంకం!

ఉత్తరాఖండ్‌లో వరదలు సృష్టించిన విషాద ఘటనలో ఆచూకి తెలియని వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Published : 17 Feb 2021 22:04 IST

11వ రోజు కొనసాగుతున్న ఆపరేషన్‌

తపోవన్‌(ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్‌లో వరదలు సృష్టించిన విషాద ఘటనలో ఆచూకీ తెలియని వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటన జరిగి 11 రోజులు అయ్యింది. తపోవన్ సొరంగం నుంచి ఇప్పటికే 11 మృతదేహాలను బయటకు తీశారు. అందులో చిక్కుకుపోయిన మరికొందరి కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. తాజాగా సొరంగంలో మరోసారి నీరు చేరుతుండడంతో సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

తపోవన్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఓవైపు సొరంగంలో బురదను తొలగిస్తూనే, మరోవైపు సొరంగానికి రంధ్రం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు బురదను తొలగించుకుంటూ దాదాపు 150 మీటర్ల లోపలికి వెళ్లగలిగినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ ఏపీ సింగ్‌ వెల్లడించారు. అయితే, దాదాపు 190మీటర్ల లోపల కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్న అధికారులు, శిథిలాలను తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అయితే, విషాద ఘటన జరిగి 11రోజులు కావడం, ఇప్పటికే కొందరి మృతదేహాలు లభ్యం కావడంతో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వారు బతికుండే అవకాశం లేదని సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అందులో చిక్కుకుపోయిన ప్రతి వ్యక్తినీ బయటకు తీసేవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటలో ఇప్పటివరకు మొత్తం 58 మృతదేహాలు లభ్యంకాగా మరో 146 మంది ఆచూకీ లభించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని