Train Accident: నేలలో కూరుకుపోయిన బోగీ.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం?
ఒడిశా రైలు ప్రమాదంలో నేలలో కూరుకుపోయిన చివరి బోగీని బయటకు తీసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇది బయటకు వస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం (Odisha Rail Accident) తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 270 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు సహాయక చర్యలు దాదాపు ముగిశాయి. ఈ క్రమంలోనే.. నేలలో కూరుకుపోయిన చివరి బోగీని వెలికితీయడం సవాల్‌గా మారింది. దీనికోసం భారీ క్రేన్‌లు, బుల్‌డోజర్‌లను రంగంలోకి దించారు. మరో బోగీ ఎగిరి మీదపడటంతో ఈ బోగీ నేలలో కూరుకుపోయింది. దీన్ని వెలికితీస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ట్రాక్‌లను క్లియర్ చేయడం, శకలాలను తొలగించే ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో మూడు రైళ్లు ఢీకొన్నాయి. షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు నుంచి హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్సు రైలు ప్రమాదానికి గురయ్యాయి. రైళ్లు అతివేగంతో వెళ్లడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని బోగీలు గాల్లోకి లేచి, తిరిగిపోయాయి. అంతేబలంగా కిందికి పడిపోవడంతో వాటితోపాటు పట్టాలు ధ్వంసమయ్యాయి. ఒక బోగీపై మరొకటి దూసుకెళ్లడంతో వాటికింద ప్రయాణికులు నలిగిపోయారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.