Joshimath: జోషీమఠ్‌పై అత్యవసర విచారణ జరపలేమన్న సుప్రీం కోర్టు

జోషిమఠ్‌(Joshimath)పై అత్యవసర విచారణ చేపట్టలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ప్రజాప్రతినిధుల పరిధిలోవి వారికి చెప్పాలని హితవు పలికింది.

Updated : 13 Jan 2023 12:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జోషిమఠ్‌(Joshimath)కు తక్షణమే ఉపశమనం కల్పించాలంటూ దాఖలైన పిల్‌పై అత్యవసరంగా విచారణ జరపలేమని మంగళవారం సుప్రీం కోర్టు (supreme court)తేల్చి చెప్పింది. ముఖ్యమైన ప్రతి ఒక్కదాని కోసం కోర్టు(supreme court)కు రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. అవిముక్తేశ్వరానంద సరస్వతి దాఖాలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. జోషిమఠ్‌ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ఈ పిల్‌లో కోరారు. దీంతోపాటు అక్కడి బాధితులకు పరిహారం, ఆర్థిక సాయం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిల్‌పై సీజే డీవై చంద్రచూడ్‌, జసిస్ట్‌ పీఎస్‌ నరసింహా వాదనలు విన్నారు. 

ఈ పిల్‌ అత్యవసరమని.. వెంటనే విచారణ చేపట్టాలని  పిటిషనర్‌ తరపు న్యాయవాది సీజే చంద్రచూడ్‌ను అభ్యర్థించారు. దీనికి సీజే స్పందిస్తూ..‘‘ఈ దేశంలో అత్యవసరమైన ప్రతిదానికి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రజలు ఎన్నుకొన్న వ్యవస్థలు ఉన్నాయి. వారి పరిధిలోకి వచ్చేవి వారు చేయగలరు. ఈ పిల్‌ను 16వ తేదీకి వాయిదా వేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. 

 రెండు హోటళ్ల కూల్చివేత..

జోషిమఠ్‌లో ప్రమాదకరంగా మారిన రెండు హోటళ్లను అధికారులు కూల్చివేయనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కార్యదర్శి ఆర్‌.మీనాక్షి సుందరమ్‌ వెల్లడించారు. మూడంతస్తుల ఎత్తులో నిర్మించిన మలారీ, మౌంట్‌ వ్యూ హోటళ్లు ప్రమాదకరంగా మారాయాని చెప్పారు. మరి కొన్ని రోజుల్లో వీటిని పూర్తిగా కూల్చివేస్తామన్నారు. ఈ రెండు భవనాల సమీపంలో ఇతర నిర్మాణాలు ఉండటంతో తొలుత వీటిని కూల్చివేయడం సురక్షితమన్నారు.  సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌, రూర్కీలోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటికే జోషిమఠ్‌ (Joshimath)చేరుకొన్నారు. నేటి నుంచి ఈ కూల్చివేతలు మొదలు కానున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు