Resort Murder: రిసార్టు మర్డర్‌.. ఆమె ‘ప్రత్యేక’ సేవలకు నిరాకరించినందుకే..!

కొద్దిరోజులుగా కనిపించకుండా పోయి, శవమై తేలిన యువతి హత్యకేసు ఉత్తరాఖండ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది.

Published : 25 Sep 2022 01:35 IST

దేహ్రాదూన్‌: కొద్దిరోజులుగా కనిపించకుండా పోయి, శవమై తేలిన యువతి హత్యకేసు ఉత్తరాఖండ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే భాజపా నేత వినోద్‌ ఆర్య కుమారుడు, రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్య, అతడి సిబ్బంది అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర డీజీపీ అశోక్‌ కుమార్ కీలక విషయం వెల్లడించారు. సదరు యువతి రిసార్టుకు వచ్చే అతిథులకు ‘ప్రత్యేక’ సేవలు అందించేందుకు నిరాకరించడం వల్లే వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఆ యువతి తన స్నేహితుడితో జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. 
    
రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని ఆమెపై యజమాని ఒత్తిడి తెచ్చాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు ఆమె ఫేస్‌బుక్ స్నేహితుడు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఆమె హత్యకు గురికావడానికి ముందు.. తన స్నేహితుడికి ఫోన్‌ చేసి, తాను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినట్లు సమాచారం. ‘రాత్రి 8.30 తర్వాత  ఆమెకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కలవలేదు. తర్వాత పులకిత్‌ ఆర్యకు ఫోన్‌ చేశాను. నిద్రపోయేందుకు ఆమె తన గదికి వెళ్లిందని అతడు సమాధానమిచ్చాడు. తర్వాత రోజు మళ్లీ అతడికి ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఆ వెంటనే అతడి సోదరుడు అంకిత్‌ ఆర్యకు ఫోన్‌ చేశాను. ఆమె జిమ్‌లో ఉందని అతడు బదులిచ్చాడు. రిసార్టు చెఫ్ మాత్రం ముందు రోజు నుంచే ఆ యువతిని చూడలేదన్నాడు’ అంటూ ఆమె స్నేహితుడు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. తన కుమార్తెను వేధింపులకు గురిచేశారని ఇదివరకు ఆమె తండ్రి కూడా ఆరోపించారు.

కేసు నేపథ్యమిది..

పులకిత్‌ ఆర్యకు రిషికేశ్‌ దగ్గర్లో వనతారా రిసార్టు ఉంది. అక్కడ రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి సెప్టెంబర్ 18న కనిపించకుండా పోయింది. సెప్టెంబర్ 21న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. ఈ కేసులో పులకిత్‌, అతడి ఇద్దరు సిబ్బంది నిందితులని పోలీసుల విచారణలో తేలింది. నిన్న వారిని అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. యువతి మృతదేహాన్ని రిసార్టుకు సమీపంలోని కాలువ వద్ద గుర్తించారు.

ఈ ఘటన రాజకీయంగా వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ ధామి తీవ్రంగా స్పందించారు. నిందితులు ఎలాంటి వారైనా వదిలేదిలేదని బాధితులకు హామీ ఇచ్చారు. ఇక, రిసార్టుకు చెందిన అక్రమనిర్మాణాన్ని అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు. అయితే ఈ కేసు విషయంలో ఆగ్రహానికి గురైన స్థానికులు ఆ రిసార్టుకు నిప్పు పెట్టారు. అలాగే ఈ ఘటనను భాజపా కూడా తీవ్రంగా తీసుకుంది. నిందితుడి తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను పార్టీ నుంచి బహిష్కరించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts