Rail fare concession: ‘రైళ్లలో సీనియర్‌ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించండి’!

రైళ్లలో వయో వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని కేరళ సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ ......

Published : 23 May 2022 16:33 IST

రైల్వే మంత్రికి కేరళ ఎంపీ విజ్ఞప్తి

దిల్లీ: రైళ్లలో వయో వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని కేరళ సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. కరోనా విజృంభణ సమయంలో రైళ్లలో సీనియర్‌ సిటిజన్ల ప్రయాణ టిక్కెట్ల రుసుములో ఇచ్చే రాయితీలను కేంద్రం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ఎంపీ లేఖ రాస్తూ.. కరోనా వైరస్‌ పేరిట రైళ్లలో ఇచ్చే రాయితీలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది సీనియర్‌ సిటిజన్లపై పడిందన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో రాయితీలను పునరుద్ధరించాలని సీనియర్‌ సిటిజన్లు పదే పదే డిమాండ్‌ చేస్తున్నా సమీక్షించడం లేదని ఎంపీ లేఖలో విమర్శించారు. దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో సమర్థమైన రవాణాను అందించేలా భారతీయ రైల్వేలను స్థాపించిన ప్రాథమిక ఉద్దేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొన్నేళ్లుగా సీనియర్‌ సిటిజన్లతో పాటు దాదాపు 50కి పైగా కేటగిరీల ప్రజలు ప్రయాణాన్ని సరసమైనదిగా చేసేందుకు పలు రాయితీలు కల్పించారన్నారు. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో రద్దు చేస్తున్నామని, దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక  కొనసాగిస్తామనే పరోక్ష సంకేతాలతో రాయితీలు నిలివేశారన్నారు. దురదృష్టవశాత్తూ కరోనా పేరుతో కేంద్రం ఈ రాయితీలను శాశ్వతంగా ఎత్తివేసి దేశ ప్రజలకు నష్టం చేసిందని ఆరోపించారు.

2020-2022 మార్చి మధ్య కాలంలో 7కోట్ల మందికి పైగా సీనియర్‌ సిటిజన్లు రైల్వే సేవలను ఉపయోగించడంతో ఈ రాయితీల ఉపసంహరణ ప్రభావం గణనీయంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు. అందువల్ల రైల్వేల్లో సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనేకమంది సీనియర్‌ సిటిజన్లు పూర్తి టిక్కెట్‌ రుసుము చెల్లించే పరిస్థితుల్లో లేరని, రాయితీ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ జీవితంలో దేశానికి ఎంతో సేవ చేసిన సీనియర్‌ సిటిజన్లంతా పదవీ విరమణ చేశాక గౌరవంగా ఉండేలా చూడటం ఎంతో ముఖ్యమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని