Published : 04/12/2021 01:19 IST

Omicron : ఒమిక్రాన్‌ భయం.. ఆంక్షల వలయంలోకి ప్రపంచ దేశాలు..!

కరోనా కోరల నుంచి బయటపడి దాదాపు అన్ని దేశాల్లోనూ సాధారణ పరిస్థితులు వచ్చేశాయని ఊపిరి పీల్చుకున్నాం. నాలుగైదు నెలలుగా అంతా సద్దుమణిగిందనుకునే లోపే తన ఉనికిని మహమ్మారి మరోసారి చాటుకుంది. ఎప్పటిలాగే కొత్తరూపంలో మార్పు చెందుతూ.. ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌ సెకెండ్‌ వేవ్‌లో తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అంతకుముందు ఆల్ఫా, బీటా రకాలు వచ్చినా.. డెల్టా పెట్టిన తిప్పలు అవి పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. దాదాపు 14 దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు క్రమంగా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి.

వారం రోజుల క్రితమే..

ఆల్ఫా పోయింది. డెల్టా డేంజర్‌ తొలగింది. ఇప్పుడు ఒమిక్రాన్‌ కథ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన ఈ వేరియంట్‌ గురించి ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ఇప్పటికే కరోనా గత వేరియంట్‌లు మిగిల్చిన చేదు అనుభవాల నుంచి అన్ని దేశాలూ ఇంకా తేరుకోలేదు. ఈ లోగా ఒమిక్రాన్‌ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. దక్షిణాఫ్రికాలో తొలికేసు నమోదైన రెండు మూడు రోజుల్లోనే ఒమిక్రాన్‌ బాధిత దేశాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్‌ వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య అధికమవుతోంది. అవి ఒమిక్రాన్‌ వల్లేనని ఇంకా నిర్ధరణ కాకపోయినా.. బాధితులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు దక్షిణాఫ్రికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

మాస్కు నిబంధనలు మరింత కఠినం

బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయిల్‌, హాంకాంగ్‌, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడింది. ఫలితంగా అన్ని దేశాలూ అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ సహా పలుదేశాలు మాస్కుల వంటి నిబంధనల్ని కట్టుదిట్టం చేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. జపాన్‌లోనూ ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. సరిహద్దులు మూసేస్తున్నామని ప్రకటించిన మరుసటి రోజే జపాన్‌లో తొలికేసు బయటపడింది. నమీబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి శాంపిళ్లను పరీక్షించగా.. ఒమిక్రాన్‌ రకం కేసుగా నిర్ధారణ అయ్యిందని జపాన్‌ వెల్లడించింది. సౌదీ అరేబియాలోనూ ఈ తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థను దక్షిణాఫ్రికా హెచ్చరించక ముందే.. తమ దేశంలోకి ఈ వేరియంట్‌ వ్యాపించి ఉంటుందని నెదర్లాండ్స్‌ వెల్లడించింది. ఈ నెల 24న ఒమిక్రాన్‌ గురించి డబ్ల్యూహెచ్‌వోకు దక్షిణాఫ్రికా చెప్పిందని అయితే, తమ దేశంలో ఈ నెల 19 నుంచి 23 తేదీల మధ్య తీసిన నమూనాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు నెదర్లాండ్స్‌ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఫలితంగా ఒమిక్రాన్‌ ఎప్పుడు ఎక్కడ పుట్టిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆరు రెట్లు వేగంగా..!

ఈ వేరియంట్‌ మూలాలెక్కడ అనే విషయాన్ని పక్కన పెడితే.. ఆ ప్రభావం ఎలా ఉంటుందన్నదే చర్చకు వస్తున్న విషయం. ఈ నెల 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఒమిక్రాన్‌ను వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా ప్రకటించింది. జీనోమ్‌ సీక్వెన్స్‌ చేసి ఈ  వేరియంట్‌ తీవ్రతను గుర్తించాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్‌ వేరియంట్‌, డెల్టా వేరియంట్‌ కన్నా ఆరురెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. ప్రభావిత దేశాల్లోని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో కూడా పదేపదే హెచ్చరిస్తూనే ఉంది. పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలు అందుబాటులోకి రాగానే వెల్లడిస్తామంటోంది. ఆందోళన చెంది కఠిన ఆంక్షలు విధించడం సరికాదని చెబుతోంది.

స్వల్ప లక్షణాలే..!

రోగ లక్షణాల విషయంలోనూ కొత్త వేరియంట్‌పై తీవ్ర ఆందోళన నెలకొంది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి చెందిన సమయంలో చాలా మంది బాధితుల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తాయి. కృత్రిమ ఆక్సిజన్‌ అందించి ప్రాణాలు నిలుపుకోవాల్సి వచ్చింది. కాగా, ఇప్పుడు ఒమిక్రాన్‌ ఎలాంటి లక్షణాలతో విరుచుకుపడుతుందోనన్న భయం మొదలైంది. దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యులు ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయని వారు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రకటన కాస్తో కూస్తో ఊరటనిస్తున్నా.. పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదన్నమాటే సర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వాటి ఫలితాలు వస్తేగానీ, వేరియంట్‌ ఎలా మ్యుటేట్‌ అవుతోందన్నది తెలిసేలా లేదు.

భారత్‌లోనూ మొదలైన ఆందోళన

భారత్‌లోనూ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఆందోళన మొదలైంది. ఒక్కోరాష్ట్రం అప్రమత్తమవుతోంది. విదేశీ ప్రయాణికుల్ని గుర్తించడం, పరీక్షించడం లాంటి కట్టడి చర్యలు మళ్లీ ప్రారంభించారు. ఫస్ట్‌, సెకండ్‌వేవ్ సమయంలో మహారాష్ట్ర ఎలా వణికిపోయిందో కళ్లారా చూశాం. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఆ రాష్ట్రం జాగ్రత్తపడుతోంది. వేరియంట్‌ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. వారం రోజుల్లో మూడుసార్లు కరోనా పరీక్షలు చేసి నెగెటివ్‌గా నిర్ధరించుకున్నాకే అనుమతించాలని నిర్ణయించింది. భారత్‌లో పలువురు వైద్యనిపుణులు ఈ వేరియంట్‌లో ఉత్పరివర్తనాలపై హెచ్చరికలు చేయడం అన్ని రాష్ట్రాలనూ కలవర పెడుతోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 30కి పైగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు పలువురు చెబుతున్నారు. ఈ మ్యుటేషన్లే ప్రమాదకరంగా మారవచ్చన్న ఆందోళన నెలకొంది.

పరిశోధన సంస్థల అప్రమత్తం

కొవిడ్‌ కొత్త రకం ఒమిక్రాన్‌పై అధ్యయనం చేసేందుకు పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో అనుభవం కలిగిన సీసీఎంబీ మరోసారి కొవిడ్‌ జీనోం సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టింది. మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన కేసుల్లో  5శాతం నమూనాలను వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ల్యాబ్‌లకు పంపనున్నారు. ఇందులో అత్యధిక నమూనాలు సీసీఎంబీకి చేరుతున్నాయి. గత ఏడాది మే నుంచి సీసీఎంబీలో వైరస్‌ జన్యుక్రమ పరిశోధనలు జరుగుతున్నాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని