Consumer Affairs Ministry: వినియోగదారులు మొబైల్‌ నెంబర్‌ చెప్పక్కర్లేదు: కేంద్రం

కొనుగోలు సమయంలో వినియోగదారులు సేవలు పొందేందుకు తమ వ్యక్తిగత వివరాలు అందించడం తప్పనిసరేం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కారణంతో రిటైలర్లు సేవలను నిలిపివేయకూడదని చెప్పింది.

Published : 24 May 2023 02:03 IST

దిల్లీ: వినియోగదారులకు (Consumers) సేవలు అందించేందుకు రిటైలర్లు (Retailers) వారి వ్యక్తిగత వివరాలు అడగవద్దని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ (Consumer affairs Ministry) ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఏదైనా రిటైల్‌ స్టోర్‌లో వస్తువు కొనుగోలు చేసినప్పుడు బిల్లు రూపొందించేందుకు వినియోగదారుడి పేరు, మొబైల్‌ నెంబర్‌ లాంటి వివరాలు అడుగుతుంటారు. వాటిని బహిర్గతం చేసేందుకు కొందరు ఇష్టపడరు.. అలాగని వారికి సేవలు అందించేందుకు నిరాకరించకూడదని రిటైలర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు.

వ్యక్తిగత వివరాలు ఇవ్వకపోతే రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారంటూ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్‌కుమార్‌ వెల్లడించారు. ‘‘వినియోగదారుల కాంటాక్ట్‌ నెంబర్లు లేనిదే బిల్లు జనరేట్‌ చెయ్యడం కుదరడం లేదని విక్రేతలు చెబుతున్నారు. కానీ, ఇది వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం సరైన వాణిజ్య విధానం కాదు. అంతేకాకుండా ఆ సమాచారం సేకరించడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’ అని  రోహిత్‌కుమార్‌ సింగ్‌ విలేకరులకు తెలిపారు. వినియోగదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా రిటైల్‌ సంస్థలతోపాటు సీఐఐ (కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ), ఎఫ్‌ఐసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ)లకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.

బిల్లును రూపొందించడానికి వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌లను రిటైలర్‌కు చెప్పడం తప్పనిసరేం కాదు. అయినప్పటికీ లావాదేవీలను పూర్తి చేసేందుకు వినియోగదారులు కచ్చితంగా ఒక నెంబరు చెప్పాల్సి వస్తోంది. ఇష్టం లేకపోయినా వారికి మరో మార్గం కనిపించడం లేదు. చాలా మంది వినియోగదారులకు ఈ అనుభవం ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని