Stolen Antiquities: ‘14 ఏళ్లలో రెండు వస్తే.. ఏడేళ్లలో 105 తీసుకొచ్చాం’

భారత్‌లో చోరీకి గురై, విదేశాలకు తరలిపోయిన కళాఖండాలు, పురాతన వస్తువులు, విగ్రహాల్లో 105కు పైగావాటిని ఈ ఏడేళ్లలో స్వదేశానికి తిరిగి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. త్వరలో అమెరికా నుంచి మరో 94 పురాతన వస్తువులు ఇక్కడికి చేరుకుంటాయని...

Published : 30 Nov 2021 01:34 IST

దిల్లీ: భారత్‌లో చోరీకి గురై, విదేశాలకు తరలిపోయిన కళాఖండాలు, పురాతన వస్తువులు, విగ్రహాల్లో 105కు పైగా స్వదేశానికి తిరిగి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. త్వరలో అమెరికా నుంచి మరో 94 పురాతన వస్తువులు ఇక్కడికి చేరుకుంటాయని చెప్పింది. 2001 నుంచి రెండు దశాబ్దాల వ్యవధిలో భారత్‌కు తిరిగి తీసుకొచ్చిన పురాతన వస్తువుల వివరాలను కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. 2001లో హాలండ్ నుంచి ఒకటి, 2013లో ఫ్రాన్స్ నుంచి మరొకటి.. కేవలం రెండు శిల్పాలను మాత్రమే ఇక్కడికి రప్పించినట్లు ఈ వివరాల్లో వెల్లడైంది.

అమెరికా నుంచి 157..

అదే 2014 నుంచి ఇప్పటివరకు 105 వస్తువులను తిరిగి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు రాతపూర్వక సమాధానంలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశం మొత్తం 157 పురాతన వస్తువులను తిరిగి భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ‘హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన సదరు కళాఖండాల్లో 63 ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాయి. మిగతావి త్వరలోనే వస్తాయి. ఆస్ట్రేలియా నుంచి మరో తొమ్మిదింటిని తీసుకొచ్చాం’ అని ప్రభుత్వం వెల్లడించింది.

కేంద్రం ఇటీవలే కెనడా నుంచి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చి.. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించిన విషయం తెలిసిందే. ఇలా అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియాల నుంచి ఆయా పురాతన కళాఖండాలు భారత్‌కు చేరుకున్నాయి. వాటిని తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లోని పురావస్తు ప్రదర్శనశాలలు, దిల్లీలోని నేషనల్ మ్యూజియానికి అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని