Amit Shah: చరిత్రను తిరగరాయండి.. కేంద్రం మీ వెంటే..: అమిత్‌ షా

దేశ చరిత్రను తిరగరాయాలని చరిత్రకారులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కోరారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

Published : 25 Nov 2022 01:41 IST

దిల్లీ: దేశ చరిత్రను తిరగరాయాలని చరిత్రకారులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కోరారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ‘‘ నేను చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా చదువుకున్న వ్యక్తిని. భారత దేశ చరిత్ర సరిగా రాయలేదని, కొన్ని సందర్భాల్లో దానిని వక్రీకరించి రాశారని చాలా సార్లు విన్నాను. అది నిజమే కావొచ్చు. అందుకే, దానిని తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని  అమిత్‌ షా అన్నారు. అస్సాం ప్రభుత్వం దిల్లీలో ఏర్పాటు చేసిన అహోం జనరల్‌ లచిత్‌ బర్ఫకన్‌ 400వ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా రాయడంలో మనకు అడ్డుపడేదెవరని అన్నారు. ప్రస్తుతం ఉన్న చరిత్ర సరికాదనే విషయాన్ని పక్కనపెట్టి, 150 ఏళ్లు పాలించిన 30 రాజవంశాలు, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడిన 300 మంది యోధులపై పరిశోధన చేయాలని ప్రొఫెసర్లు, విద్యార్థులకు సూచించారు.  

అసలు చరిత్ర బయటకి వస్తే.. వక్రీకరించి రాసిన చరిత్ర ఇక మట్టిలో కలిసిపోతుంది అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ముందుకొచ్చి, చరిత్ర తిరగ రాయాలని తద్వారా భవిష్యత్‌ తరాల వారికి మనం స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చరిత్రను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని అమిత్‌ షా తెలిపారు. లచిత్‌ ఎంతో ధీరత్వం ప్రదర్శించి మొఘల్‌ సామ్రాజ్య వ్యాప్తిని అడ్డుకున్నారని అన్నారు. సరియాఘాట్‌లో జరిగిన యుద్ధంలో ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడారన్నారు. ఈ సందర్భంగా లచిత్‌పై చిత్రీకరించిన డాక్యుమెంటరీని షా ప్రారంభించారు.

మరోవైపు ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు, భారత్‌లోని మిగతా ప్రాంతాల మధ్య వ్యత్యాసం పూర్తిగా తగ్గిపోయిందని, ఈశాన్య భారతంలో శాంతిస్థాపన జరిగిందని అమిత్‌ షా అన్నారు. లచిత్‌ బర్ఫకన్‌ జీవితంపై పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, కనీసం 10 భాషల్లో దానిని తర్జుమా చేయాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను కోరారు. లచిత్‌ శౌర్య పరాక్రమాలను దేశప్రజలంతా తెలుసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు