జనాభా సగం..కానీ, 83శాతం టీకాలు వాళ్లవద్దే..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ అన్ని దేశాలకు సమతుల్యంగా అందడం లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి ఆందోళన వ్యక్తంచేసింది.

Updated : 11 May 2021 21:35 IST

ఆవేదన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ అన్ని దేశాలకు సమతుల్యంగా అందడం లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి ఆందోళన వ్యక్తంచేసింది. ముఖ్యంగా ధనిక దేశాలే వ్యాక్సిన్‌ డోసుల్లో ముందున్నాయని పేర్కొంది. ప్రపంచ జనాభాలో సగం మంది ధనిక దేశాల్లో ఉండగా, కరోనా వ్యాక్సిన్లలో మాత్రం ఆ దేశాల వాటా 83శాతం ఉన్నాయని తెలిపింది. వ్యాక్సిన్‌ ప్రక్రియలో అసమానత్వం వల్ల పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది.

రోనా వ్యాక్సిన్‌ అందించంలో ధనిక ఆదాయ దేశాలు మాత్రమే ముందున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తొలినుంచి చెబుతోంది. ప్రపంచంలో 53శాతం జనాభా ధనిక, ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నారు. కానీ, ఆయా దేశాల కరోనా వ్యాక్సిన్‌ వాటా మాత్రం 83శాతం. కానీ, 47శాతం జనాభా ఉన్న అల్ప ఆదాయ దేశాలు మాత్రం కేవలం 17శాతం వ్యాక్సిన్‌ వాటాను కలిగి ఉన్నాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ అందేలా ధనిక దేశాలు చొరవ చూపాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కిచెప్పారు. ఇక భవిష్యత్తులో కొత్తగా పుట్టుకొస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌లను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ సిద్ధం చేయడంతో పాటు ప్రజారోగ్య సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అధిక ఆదాయ దేశాలు ముందున్న నేపథ్యంలో ఆఫ్రికా వంటి ఖండంలో ఇంకా వ్యాక్సిన్‌ ముఖం చూడని దేశాలున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు డజనుకు పైగా దేశాల్లో ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. వీటిని అధిగమించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘కొవాక్స్‌’ ద్వారా వ్యాక్సిన్‌ అందించాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నందున చాలా దేశాలకు సరిపడా వ్యాక్సిన్‌ అందడం లేదు. ముందస్తుగా ఆర్డరు చేసుకోవడంతోనే ధనిక దేశాలు వ్యాక్సిన్‌ సమీకరణలో ముందున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రపంచంలోనే వ్యాక్సిన్‌ కేంద్రంగా ఉన్న భారత్‌లోనే టీకా కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని