Karnataka Polls: కళ్లుచెదిరే రీతిలో.. ఈ కన్నడ నేతల ఆస్తులు..!

కన్నడనాట  జరగనున్నట అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) బరిలో దిగుతున్న కొందరు నేతల ఆస్తులు భారీ స్థాయిలో ఉన్నాయి. భాజపా నేత ఎంటీబీ నాగరాజు (MTB Nagaraj), కాంగ్రెస్‌ నేత శివకుమార్‌లకు (DK Shivakumar) రూ.వెయ్యి కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

Published : 19 Apr 2023 02:04 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో కొందరి ఆస్తుల వివరాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. అంతేకాకుండా గత ఎన్నికలతో పోలిస్తే వారి ఆదాయంలో భారీ పెరుగుదల కనిపించడం గమనార్హం. ఇలా కన్నడ పోరులో భాగంగా ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో కొందరి సంపన్నుల ఆస్తుల వివరాలను ఓసారి పరిశీలిస్తే..

ఎంటీబీ నాగరాజు: కర్ణాటక చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజు (హొసకోటె)కు భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తాజాగా దాఖలుచేసిన అఫిడవిట్‌లో తన పేరిట రూ.1,609 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. 2018 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలిచిన ఆయన అప్పట్లో రూ.1,120 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో (2020లో) ఓడిపోయారు. అనంతరం.. విధానపరిషత్తుకు ఎన్నికై మంత్రిపదవి చేపట్టారు. ప్రస్తుతం హొసకోటె నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా ఆయన పోటీచేస్తున్నారు. ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు ఏకంగా రూ.500కోట్లు పెరగడం గమనార్హం. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరులో ఉన్న నేతల్లో ఈయనే అత్యంత ధనికుడు. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న ఎం.టి.బి.నాగరాజుకు స్థిరాస్తి వ్యాపారం, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్నాయి.

డీకే శివకుమార్‌: కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆస్తులు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఆస్తుల విలువ రూ.1358 కోట్లుగా ఉన్నట్లు తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోలిస్తే ఈయన ఆస్తులు కూడా సుమారు రూ.500 కోట్లు పెరిగాయి. కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీకేఎస్‌.. కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు ప్రకటించుకొంటున్నారు.

మునిరత్న నాయుడు: కర్ణాటక ఉద్యానశాఖ మంత్రి మునిరత్న నాయుడు రాజరాజేశ్వరీ నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. తనకు రూ.293 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లకుపైగా పెరగడం గమనార్హం. అయితే, ఆయనకు రూ.100 కోట్లకుపైగా అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. కార్లు, టిప్పర్లు, బైకులు మొత్తంగా.. 30 వాహనాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

హెచ్‌డీ కుమారస్వామి: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ కీలక నేత హెచ్‌డీ కుమారస్వామి కుటుంబానికి రూ.181 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే, గత ఎన్నికల సమయంతో పోలిస్తే కుమారస్వామి, ఆమె భార్య అనిత ఆస్తుల విలువ రూ.14 కోట్లు మాత్రమే పెరిగింది. అంతకుముందు కుమారస్వామి దంపతుల ఆస్తులు రూ.167 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. కనకపుర లోక్‌సభ స్థానం నుంచి 1996లో లోక్‌సభకు ఎన్నికైన కుమారస్వామి.. 2004లో రామనగర స్థానం నుంచి గెలుపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. కాంగ్రెస్‌, భాజపా సంకీర్ణ ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి.. ప్రస్తుతం చెన్నపట్న స్థానం ఉంచి బరిలో దిగుతున్నారు.

బీవై విజయేంద్ర: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకూ రూ.100 కోట్లకు పైనే ఆస్తులున్నాయి. శికారిపుర నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమైన విజయేంద్రకు రూ.126 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన ఆయన.. 2020లో భాజపా కర్ణాటక ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి తన తండ్రి యడియూరప్ప ఎన్నికల బరిలో లేకపోవడంతో విజయేంద్రకు శికారిపుర స్థానం ఖాయమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు