Kiren Rijiju: భారత్‌లో ఉన్న విచారకర విషయం ఏంటంటే..? ఆప్‌పై కేంద్రమంత్రి కౌంటర్‌

దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఇంట్లో సీబీఐ దాడులు ఆప్‌ సర్కార్‌లో కలకలం సృష్టిస్తున్నాయి.

Published : 20 Aug 2022 11:20 IST

దిల్లీ: దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఇంట్లో సీబీఐ దాడులు ఆప్‌ సర్కార్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సిసోదియా చేసిన కృషిని అంతర్జాతీయ మీడియా గుర్తించిన వేళ.. ఈ సోదాలు జరగడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురితమైన కథనాన్ని కేజ్రీవాల్ మీడియా ముందు ప్రదర్శించగా.. ఇది చెల్లింపు వార్త అంటూ భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ ఆప్‌పై విమర్శలు గుప్పించారు.

‘ఈ దేశంలో ఉన్న విచారకర విషయం ఏంటంటే.. చాలా మంది ప్రజలు ఆంగ్లంలో మాట్లాడటాన్ని చాలా గర్వంగా భావిస్తారు. ఒక సినిమా ఆస్కార్‌కు నామినేట్‌ అయినా లేదా మన గురించి కథనం న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురితమైనా గొప్ప వేడుక చేసుకుంటారు. ఈ తరహా వ్యక్తులు విదేశీ విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు. వాటినే విశ్వసిస్తారు’ అంటూ కేజ్రీవాల్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.  

సిసోదియా నివాసం సహా దేశంలో ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సిసోదియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అయితే ఈ దాడులను ఆప్‌ తీవ్రంగా ఖండించింది. తమ ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతుండడంతో ఓర్వలేక కేంద్రం ఇలా భయపెట్టాలని చూస్తోందని దుయ్యబట్టింది. సిసోదియా.. విద్యాశాఖతో పాటు ఎక్సైజ్‌ శాఖనూ చూస్తున్నారు. గత నవంబరులో తీసుకువచ్చిన నూతన ఎక్సైజ్‌ విధానంపై ఆరోపణలు రావడంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా సిఫార్సు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి, రంగంలో దిగింది.

కాగా.. ఈ దిల్లీ విద్యావిధానంపై న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన కథనం.. ఖలీజ్‌ టైమ్స్‌లోనూ ప్రచురితం కావడాన్ని భాజపా ఎత్తిచూపింది. ఇదొక చెల్లింపు వార్త అని ఆరోపించింది. అయితే దీనిపై న్యూయార్క్ టైమ్స్‌ స్పందించింది. దిల్లీ విద్యా విధానంపై తమ కథనం నిష్పాక్షికమైనదని, ఖలీజ్‌ టైమ్స్‌లోనూ ప్రచురితమైనంత మాత్రాన అది చెల్లింపు వార్త కానేకాదని వివరణ ఇచ్చింది.

15 గంటల పాటు సోదాలు..

తన నివాసంలో సీబీఐ అధికారులు 15 గంటల పాటు సోదాలు నిర్వహించారని సిసోదియా వెల్లడించారు. అలాగే తన కంప్యూటర్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా.. నూతన ఎక్సైజ్‌ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని