UPSC 2021: తుపాకీ గుండ్లకు వెరువని ఆయనకు.. సివిల్స్‌ తలవొంచింది..!

కర్తవ్య నిర్వహణలో నిజాయతీగా ముందుకెళ్లడమే ఆయనకు తెలుసు. ఆ తీరే ఆయనకు అవరోధాలు తెచ్చిపెట్టింది. అవినీతిని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టినందుకు తుపాకీ గుండ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.

Published : 02 Jun 2022 01:47 IST

లఖ్‌నవూ: కర్తవ్య నిర్వహణలో నిజాయతీగా ముందుకెళ్లడమే ఆయనకు తెలుసు. ఆ తీరే ఆయనకు అవరోధాలు తెచ్చిపెట్టింది. అవినీతిని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టినందుకు తుపాకీ గుండ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ సహజమేనన్నట్టుగా తనపని తాను చేసుకుంటూ వెళుతున్న ఆయనకు సివిల్‌ సర్వీసెస్ తలవొంచింది. ఆ కార్యసాధకుడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్‌ రాహీ. తన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇటీవలి సివిల్స్‌ ఫలితాల్లో 683వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.

యూపీలో హాపుర్‌లో రింకూ సింగ్‌ రాహీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేశారు. తన విధుల్లో భాగంగా 2008లో ఉపకారవేతనాలకు సంబంధించిన కుంభకోణాన్ని గుర్తించారు. రూ.83 కోట్ల విలువైన ఆ అవినీతిని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. ఎనిమిది మందిపై ఆరోపణలు రాగా.. కోర్టు నలుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇదంతా నిందితులకు నచ్చలేదు. ఓ రోజు రింకూ మీద దాడి చేశారు. ఆయనపై ఏడు సార్లు తుపాకీ గుండ్లు పేల్చారు. అంతపెద్ద దాడికి గురైనా.. రింకూ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ముఖం మీద గాయాలు కావడంతో రూపురేఖలు మారిపోయాయి. ఒక కంటి చూపు కోల్పోయారు. వినికిడి సమస్యా వచ్చింది. 

ఇన్ని లోపాలు ఉన్నా ఆయన తన ప్రయాణాన్ని ఆపలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఏఎస్‌ శిక్షణా కేంద్రంలో పాఠాలు బోధించారు. ఆ కేంద్రం డైరెక్టర్‌గానూ బాధ్యతలు చూసుకున్నారు. ఈ క్రమంలో యూపీఎస్‌సీ పరీక్షలు రాయమని అక్కడి విద్యార్థులు ఆయన్ను పదేపదే కోరేవారు. వారి ప్రోద్బలంతోనే సివిల్స్ పరీక్షలకు హాజరయ్యారు. విధులు నిర్వర్తిస్తూ.. ఈ పరీక్షల కోసం సమయం కేటాయించడం కష్టంగా అనిపించినా.. ఆయన సంకల్పం ముందు అదేమీ సమస్య కాలేదు. అందుకే తన తుది ప్రయత్నంలో 683వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ‘నేను ప్రజా ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. వ్యక్తి ప్రయోజనం, ప్రజా ప్రయోజనం.. ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే నా మొగ్గు ప్రజలవైపే’ అంటూ తన నిబద్ధతను చాటారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు ఎదురైనా ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు రింకూ సింగ్‌.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts