Rs 2000 Notes: అక్కడ ₹100 పెట్రోల్‌ కొన్నా ₹2వేల నోటే ఇస్తున్నారట!

Rs 2000 notes: దేశంలో రూ.2వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవడంతో ఆ నోటు ఉన్న ప్రజలు వాటితో పెట్రోల్‌ కొనుగోళ్లు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఈ నోట్లతో ఇంధన కొనుగోలు ఐదు రెట్లు పెరిగినట్టు పెట్రోల్‌ బంకుల సంఘం ప్రతినిధి తెలిపారు.

Published : 22 May 2023 20:10 IST

ఇందౌర్‌: దేశంలో రూ.2వేల నోట్ల(Rs 2000 Notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకొంటున్నట్టు ఇటీవల ఆర్‌బీఐ(RBI) ప్రకటించడంతో పెట్రోల్‌ బంకుల వద్ద ఈ నోట్లతో చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. రూ.2వేల కరెన్సీ నోట్లతో ఇంధనం కొనుగోళ్లు కనీసం ఐదు రెట్లు పెరిగినట్టు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ జిల్లా పెట్రోల్‌ బంకుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ వాసు వెల్లడించారు. కొందరు కస్టమర్లు తమ ద్విచక్రవాహనాలకు రూ.100ల పెట్రోల్‌/డీజిల్‌ కొనుగోలు చేసినా రూ.2వేల నోటుతోనే చెల్లింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు.  

ఆర్‌బీఐ (RBI) తీసుకున్న అనూహ్య నిర్ణయం కారణంగా రూ.2వేల నోట్లతో ఇంధన కొనుగోలుకు చెల్లింపులు పెరిగినప్పటికీ.. ఈ నోట్లను బ్యాంకుల్లో సులభంగా మార్చుకునే అవకాశం ఉన్నందున తమకు ఇదేమీ పెద్ద ఇబ్బందిగా లేదన్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది కస్టమర్లు ఆన్‌లైన్‌ చెల్లింపులు చేస్తుండటంతో పెట్రోల్‌ బంకుల వద్ద తక్కువ డినామినేషన్‌ కరెన్సీ నోట్ల లభ్యత అనేది పెద్ద సమస్యగా ఏమీ లేదన్నారు. ఇందౌర్‌ జిల్లాలో 275 పెట్రోల్‌ బంక్‌లు ఉన్నట్టు ఆయన తెలిపారు.  దేశంలో 2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకొంటున్నట్టు శుక్రవారం ఆర్‌బీఐ అనూహ్య ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ నోట్లు ఉన్నవారు సెప్టెంబర్‌ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి నోట్లను మార్చుకొనేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు, రూ.50వేలు కన్నా ఎక్కువ మొత్తంలో రూ.2వేల నోట్లను డిపాజిట్‌ చేసేవాళ్లు పాన్‌ కార్డు సమర్పించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తాజాగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని