Bullet Rail: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అందుకే ఆలస్యం: కేంద్రం

ముంబయి- అహ్మదాబాద్‌ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఇప్పటివరకు 89శాతం భూసేకరణ పూర్తయినట్టు కేంద్రం......

Published : 24 Mar 2022 01:29 IST

దిల్లీ: ముంబయి- అహ్మదాబాద్‌ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఇప్పటివరకు 89శాతం భూసేకరణ పూర్తయినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ హైస్పీడ్ రైలు (MAHSR)ను పట్టాలెక్కించడంలో మహారాష్ట్రలో భూసేకరణలో జాప్యంతో పాటు కాంట్రాక్టుల ఖరారులో ఆలస్యం, కరోనా ప్రతికూల ప్రభావం కారణంగా ఆలస్యం చోటుచేసుకున్నట్టు  కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లోక్‌సభకు తెలిపారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తంగా 1,396 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటివరకు 1,248 హెక్టార్లు (89శాతం) భూమి సేకరించినట్టు తెలిపారు. మహారాష్ట్రలో 297.81 హెక్టార్ల భూమి అవసరం కాగా.. 68.65శాతం సేకరించినట్టు తెలిపారు. పాల్ఘఢ్‌ జిల్లాలో ఐదు గ్రామాలు ఈ ప్రాజెక్టుకు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో ప్రతిపాదనలు చేశాయని తెలిపారు. వ్యతిరేకించిన గ్రామాల్లో వర్కుంటి, కల్లాలే, మాన్‌, ఖనివాడి, సాఖారేలు ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.

మరోవైపు గుజరాత్‌లో 954.28 హెక్టార్ల భూమి అవసరం ఉండగా.. 98.76శాతం సేకరణ పూర్తయినట్టు మంత్రి తెలిపారు. అలాగే, దాద్రానగర్‌ హవేలీలో 7.9 హెక్టార్లు అవసరం కాగా.. కేంద్రం 100శాతం సేకరించిందన్నారు. అయితే, మహారాష్ట్రలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ఐదు గ్రామాల ప్రజల్ని ఒప్పించేందుకు నేషనల్ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NSHRCL) అధికారులు ప్రయత్నిస్తున్నారనీ.. ఆ ప్రాజెక్టుతో జరిగే ప్రయోజనాలను చెప్పడంతో పాటు భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం కల్పిస్తామని కూడా చెబుతున్నారని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని