కొవిడ్ కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు!

గడిచిన ఏడాదిలో కొవిడ్‌ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Published : 18 Mar 2021 20:27 IST

వెల్లడించిన కేంద్ర రవాణాశాఖ

దిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. గడిచిన ఏడాదిలో కొవిడ్‌ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన నితిన్‌ గడ్కరీ, రోడ్డు ప్రమాదాల సంఖ్యపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

‘గడిచిన ఏడాది కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా లక్షా యాభైవేల మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ వల్ల సంభవించిన(1.46లక్షల) మరణాల కంటే ఇది ఎక్కువ కావడం విచారకరం’ అని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అధికంగా 18 నుంచి 35ఏళ్ల వయసువారే కావడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఏటా 4.5లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వీటిలో లక్షా 50వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా వేల మంది తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇది వారికి వ్యక్తిగతంగా తీవ్ర నష్టాన్ని కలిగించడంతో పాటు వారి కుటుంబాలకు తీవ్ర ఆవేదనను మిగులుస్తున్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా భారత్‌ దాదాపు 3.14శాతం విలువైన జీడీపీ నష్టాన్ని చవిచూస్తోందని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది.

స్క్రాపింగ్‌ సర్టిఫికెట్‌తో రాయితీలు..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తుక్కు విధానం(స్క్రాపింగ్‌ పాలసీ) వల్ల కొత్త వాహనం కొనేవారికి దాదాపు 4నుంచి 6శాతం రాయితీ లభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పాత వాహనాన్ని ఇచ్చి స్క్రాపింగ్‌ సర్టిఫికెట్‌ పొందడం వల్ల కొత్త వాహనం కొనేవారికి రోడ్‌ టాక్సులోనూ రాయితీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. వ్యక్తిగత వాహనాలకు 25శాతం, వాణిజ్య వాహనాలకు 15శాతం రాయితీ ఇచ్చే అవకాశాలున్నాయని..వీటికి అదనంగా, స్క్రాపింగ్ సర్టిఫికెట్‌‌ ద్వారా కొత్త వాహనాన్ని కొనుగోలుచేసే వారికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీ రద్దు చేసే అంశాన్ని రాష్ట్రాలు పరిశీలించవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. ఇలా కేంద్ర ప్రభుత్వ తుక్కు విధానం వల్ల దేశంలో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు జీఎస్‌టీ రూపంలో రూ.40వేల కోట్ల ఆదాయం పొందే అవకాశం ఉందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని