Published : 25 Jun 2022 01:29 IST

Karnataka: మీరు సక్రమంగా పనిచేయాలంటే ప్రధాని, రాష్ట్రపతి తరచూ పర్యటించాలా?: హైకోర్టు

బెంగళూరు: ఓ రోడ్డు నిర్మాణం కర్ణాటక(Karnataka)లోని భాజపా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో రూ.6.5 కోట్లతో వేసిన రోడ్డు ఒక్క రోజులోనే పాడైపోవడంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు సైతం అసహనం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 20న ప్రధాని మోదీ (Modi) బెంగళూరులో (Bengaluru) పర్యటించారు. ఈ నేపథ్యంలోనే బృహత్‌ బెంగళూరు మహానగర పలికె (BBMP) ఆగమేఘాల మీద రోడ్లపై తారు వేసి మమ అనిపించింది. ఇందుకు ఏకంగా రూ.23 కోట్లు ఖర్చు చేయడం విమర్శలకు దారితీసింది.

Also Read: మోదీ కోసం.. మూన్నాళ్ల ముచ్చట!

ఇదిలా ఉంటే.. మరమ్మతు చర్యల్లో భాగంగా బెంగళూరు యూనివర్సీటీ క్యాంపస్‌ సమీప రహదారులపై రూ.6.5 కోట్లతో తారు వేశారు. అయితే ప్రధాని రాకకు ముందురోజు వేసిన ఈ తారు.. పర్యటించి వెళ్లిన మరుసటి రోజే వర్షానికి గుంతలుపడటం మరిన్ని విమర్శలకు కారణమైంది. పలు చోట్ల తారు లేచిపోగా, కొన్ని చోట్ల గుంతలు పడింది. నాణ్యత లేని ఈ పనులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్రమత్తమైన పురపాలక సంఘం అధికారులు మళ్లీ మరమ్మతు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం బసవరాజ్‌ బొమ్మై సీరియస్‌ అయ్యారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బీబీఎంపీ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. ముగ్గురు ఇంజనీర్లకు ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

పురపాలక సంఘం చేపట్టిన ఈ నాణ్యతలేని పనులపై కొందరు స్థానికులు హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అంతకుముందు బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ), బెంగుళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యుఎస్‌ఎస్‌బీ) సరిగ్గా పనిచేయడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు బీబీఎంపీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రధానమంత్రి, రాష్ట్రపతి తరచూ బెంగళూరుకు వస్తే రోడ్ల పరిస్థితి మెరుగుపడవచ్చు. గత వారం మీరు గుంతలు పూడ్చడానికి రూ. 23 కోట్లు వెచ్చించారు. మీరు మీ పనులు చేసేందుకు ప్రతిసారీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వేర్వేరు రోడ్లపై ప్రయాణించవలసి ఉంటుందేమో..’ అని వ్యాఖ్యానించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని