Aaditya Thackeray: పిరికివారే వెళ్లిపోయారు.. దమ్ముంటే శివసేనను వీడి పోరాడండి..!

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra Crisis) కొనసాగుతోన్న వేళ.. శివసేన (Shiv Sena) రెబల్‌ నేతలపై ఆదిత్యఠాక్రే విమర్శలు ఎక్కుపెట్టారు.

Published : 27 Jun 2022 01:12 IST

రెబల్‌ నేతలకు ఆదిత్య ఠాక్రే సవాల్‌

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra Crisis) కొనసాగుతోన్న వేళ.. శివసేన (Shiv Sena) రెబల్‌ నేతలపై ఆదిత్యఠాక్రే విమర్శలు ఎక్కుపెట్టారు. కేవలం పిరికివాళ్లే పార్టీని విడిచివెళ్లారన్న ఆయన.. రెబల్‌ నేతలకు భద్రత కల్పించడమేంటని ప్రశ్నించారు. కశ్మీరీ పండితులకు సీఆర్‌పీఎఫ్‌ భద్రత అవసరమని.. గుహవాటికి పారిపోయిన వాళ్లకు కాదంటూ శిందే క్యాంపుపై విమర్శలు గుప్పించారు. ముంబయిలోని కలీనా, శాంటాక్రజ్ ప్రాంతాల్లో శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడిన ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) శివసేన గుర్తును, ప్రజల ప్రేమను రెబల్‌ నేతలు తీసుకెళ్లలేరంటూ వ్యాఖ్యానించారు.

పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహావికాస్‌ అఘాడీ (MVA) ప్రభుత్వంలో ప్రతిష్టంభన నెలకొంది. అస్సాంలోని గుహవాటి హోటల్‌లో మకాం చేసిన శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు ఇంకా వేచిచూసే ధోరణినే అవలంబిస్తున్నారు. ఈ సమయంలో అసమ్మతి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉద్ధవ్‌ఠాక్రే మద్దతుదారులు మహారాష్ట్రలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో శివసేన కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆదిత్య ఠాక్రే.. ద్రోహులకు పార్టీలో స్థానం ఉండదంటూ వ్యాఖ్యానించారు. ‘మనం చేసింది తప్పని, ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వానిది తప్పని భావిస్తే మనందరిదీ తప్పే. అటువంటప్పుడు పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయండి. అందుకు మేము కూడా సిద్ధమే’ అని శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.

ఓవైపు ఇలా హెచ్చరిస్తూనే అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకూ ఠాక్రే కుటుంబీకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే.. అసమ్మతి నేతల భార్యలతో చర్చలు జరుపుతున్నారు. వారి భర్తల్ని ఎలాగైనా రాజీకి వచ్చేలా చేయాలని రష్మీ ఠాక్రే కోరుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్ధవ్‌ సైతం అసమ్మతి ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నారని.. దాదాపు 20మంది రెబల్‌ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారని ఠాక్రే వర్గీయులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని