
Katrina kaif: ‘రోడ్లు.. కత్రినా బుగ్గల్లా ఉండాలి’
రాజస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ నేత రాజేంద్ర సింగ్ గుడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో రహదారులు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలన్నారు. రహదారులను బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల మంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న రాజేంద్ర సింగ్ గుడా ఝున్‌ఝును జిల్లాలోని తన నియోజకవర్గంలోని ఉడైపురవాటి ప్రాంతం ప్రజలతో సమావేశమయ్యారు. ఆయనతో తమ సమస్యల్ని విన్నవించుకుంటున్న జనం.. తమ ప్రాంతంలో రహదారులను బాగుచేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అక్కడే ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్‌తో ‘నా నియోజకవర్గంలో రహదారులు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి’ అని మంత్రి అన్నారు. దీంతో అక్కడి ప్రేక్షకుల్లో కొందరు చప్పట్లు కొట్టగా.. మరికొందరు నవ్వులు చిందించారు.
అయితే, రాజకీయ నాయకులు రహదారులను సినీతారల బుగ్గలతో పోల్చడం ఇదే తొలిసారి కాదు. 2005లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కూడా రహదారుల్ని హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ హామీ ఇవ్వడం అప్పట్లో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అదేవిధంగా మధ్యప్రదేశ్ న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ కూడా 2019లో తమ రాష్ట్రంలో గుంతలమయమైన రోడ్లను సుందరంగా.. ‘డ్రీమ్‌గర్ల్’ స్టార్ బుగ్గల్లా మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. 2013లో యూపీలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారాం పాండే ప్రతాప్‌గఢ్ జిల్లాలో రహదారులను సినీతారలు హేమమాలిని, మాధురీ దీక్షిత్ బుగ్గల్లా నిర్మిస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి సీఎం అఖిలేశ్ యాదవ్ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. అదే సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో భాజపా నేత, మంత్రి బ్రిజ్‌మోహన్ అగర్వాల్ కూడా తమ రాష్ట్ర రహదారులను హేమమాలిని బుగ్గలతో పోల్చడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
► Read latest National - International News and Telugu News