Rohini Court: ‘ఆ న్యాయవాదిని చంపేందుకే టిఫిన్‌ బాక్స్‌ బాంబు పెట్టా’

దిల్లీలోని రోహిణి కోర్టులో ఇటీవల జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి దిల్లీ స్పెషల్‌ పోలీస్‌ సెల్‌ తాజాగా ఓ డీఆర్‌డీవో శాస్త్రవేత్తను అరెస్టు చేసింది. న్యాయ వివాదాల నేపథ్యంలో ఓ లాయర్‌ను హతమార్చేందుకే ఈ పేలుడుకు పాల్పడినట్లు సమాచారం. సీసీ కెమెరా ఫుటేజీలు, ఘటన జరిగిన...

Updated : 18 Dec 2021 15:32 IST

రోహిణి కోర్టు పేలుడు కేసులో డీఆర్‌డీవో శాస్త్రవేత్త అరెస్ట్‌

దిల్లీ: దిల్లీలోని రోహిణి కోర్టులో ఇటీవల జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి దిల్లీ స్పెషల్‌ పోలీస్‌ సెల్‌ తాజాగా ఓ డీఆర్‌డీవో శాస్త్రవేత్తను అరెస్టు చేసింది. న్యాయ వివాదాల నేపథ్యంలో ఓ లాయర్‌ను హతమార్చేందుకే ఈ పేలుడుకు పాల్పడినట్లు సమాచారం. సీసీ కెమెరా ఫుటేజీలు, ఘటన జరిగిన సమయంలో ఆ న్యాయవాది కోర్టులోనే ఉండటం, బ్యాగ్‌పై ఓ కంపెనీ లోగో తదితర ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

న్యాయ వివాదాలు తనను మానసికంగా కలవరపెట్టాయని, ఈ కారణంగానే లాయర్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతో టిఫిన్‌ బాక్స్‌ బాంబు పేలుడుకు పథకం పన్నానని నిందితుడు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్థాల తయారీ పరిజ్ఞానం కూడా ఉన్నట్లు అతను ఒప్పుకొన్నాడని చెప్పాయి. మరోవైపు ఆ న్యాయవాది.. నిందితుడిపై 10 కేసులు నమోదు చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ వ్యవహరంలో దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

డిసెంబరు 9న కోర్టులోని రూం నంబర్‌ 102లో జరిగిన ఈ పేలుడులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున శబ్దం రావడంతో అక్కడున్నవారు భయాందోళనలతో పరుగులు పెట్టారు. అంతకుముందు సెప్టెంబరులోనూ ఇదే కోర్టు ఆవరణలో ఓ గ్యాంగ్‌స్టర్‌పై ప్రత్యర్థి గ్యాంగ్‌ కాల్పులు జరిపి, హత్య చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులూ హతమయ్యారు. దీంతో ఈ కోర్టులో భద్రతా చర్యల నిర్లక్ష్యంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని