Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని.. బాధ్యులను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Updated : 04 Jun 2023 16:39 IST

బాలేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాద (Odisha Train Accident) ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini vaishnaw) తెలిపారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఏమిటీ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ..?

రైల్వే భద్రతా విభాగ కమిషనర్‌ దుర్ఘటనకు (Odisha Train Accident) దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini vaishnaw) తెలిపారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని కనిపెట్టారన్నారు. అలాగే దీనికి బాధ్యులను కూడా గుర్తించారన్నారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈరోజు రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. మృతదేహాలన్నింటినీ తొలగించినట్లు తెలిపారు.

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Odisha Train Accident)లో 288 మంది దుర్మరణం చెందారు. 1,175 మందికి పైగా గాయాలపాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని