Women Reservation: డీలిమిటేషన్‌ తర్వాతే మహిళా రిజర్వేషన్లు..!

మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్‌ తర్వాతే అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Updated : 19 Sep 2023 15:08 IST

దిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును (women reservation bill) కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న బిల్లుకు.. విపక్షపార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తుండటంతో చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉభయసభల ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాతే ఇవి అమల్లోకి వస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిల్లులో ఉన్న ముఖ్యాంశాలను పరిశీలిస్తే..

మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే.. మోదీ కీలక వ్యాఖ్యలు..!

లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడోవంతు సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. దిల్లీ అసెంబ్లీకీ ఇది వర్తిస్తుంది. విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు చట్టరూపం దాల్చితే.. చట్టసభల్లో 15 ఏళ్లపాటు మహిళకు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత రొటేషన్‌ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుంది. మహిళా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మహిళలకు ఈ 33శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత 15ఏళ్ల పాటు అమల్లో ఉండనున్నాయి. తదుపరి వీటిని పెంచుకునే అవకాశం ఉంది. ఈ కోటాలోనే ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడోవంతు సీట్లను కేటాయిస్తారు. ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఈ బిల్లులో పొందుపరచలేదు. కాగా.. ఈ మహిళా రిజర్వేషన్లు రాజ్యసభ, శాసన మండళ్లకు వర్తించవు.

ఈ బిల్లు చట్టరూపం దాల్చిన అనంతరం చేపట్టే నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తైన తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపట్టాలంటే జనగణన జరగాలి. 2021లోనే జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2027 డీలిమిటేషన్‌ ప్రక్రియ తర్వాతే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని